CM Revanth Reddy: తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు ఎన్నికల హామీలకు శ్రీకారం చుట్టనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ హామీలను వారం రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు ఎన్నికల హామీలకు శ్రీకారం చుట్టనుంది. వారం రోజుల్లోగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ (బీపీఎల్ కుటుంబాలు) ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని, వారికి రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్ అందజేస్తామని చెప్పారు. అలాగే.. మార్చి 15 నుంచి రైతు భరోసాను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేసే బాధ్యతను తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన సొంత నియజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.ఈ సందర్బంగా ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ హామీల అమలుపై కీలక ప్రకటన చేశారు. కట్టెల పోయిల వద్ద మహిళల పడుతున్న కష్టాలు చూసి ఆనాడు సోనియా గాంధీ దీపం పథకం ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన నియోజకవర్గానికి వచ్చిన తొలి పర్యటనలో మొత్తం రూ.4,369 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, ఆదరణ వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా నదీ జలాలను రాయలసీమ ప్రాంతానికి తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్ అనుమతించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కె.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) హయాంలో నదీజలాల విషయంలో తెలంగాణ ఎక్కువ నష్టపోయిందని ఆరోపించారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేస్తూ.. కరీంనగర్ నుంచి మళ్లీ ఎన్నిక కాలేడని కేసీఆర్ కు తెలుసు కాబట్టే మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మహబూబ్ నగర్ కు చేసిందేమీలేదన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మహబూబ్‌నగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందని ఆరోపించారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో పర్యటించినప్పుడు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారని, పదేళ్లు దాటినా ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి నాలుగు రూపాయలు కూడా తీసుకురాలేకపోయారని వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డినే బరిలోకి దిగుతారని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 14 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మరో పోరాటానికి సిద్ధం కావాలని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను కోరారు.రూ.2,945 కోట్లతో నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ.344 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ అండ్ బీ అతిథి గృహం, డబుల్ లేన్ రోడ్లు, వంతెనల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.