ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా తెలంగాణ ముందడుగు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం 

By Arun Kumar PFirst Published Aug 26, 2024, 11:56 PM IST
Highlights

భారత దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ తో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయం ఏమిటంటే... 

ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత క్రీడాకారులు ఆశించినస్థాయిలో రాణించలేకపోయారు. కనీసం రెండంకెల పతకాలు... అందులో రెండుమూడు స్వర్ణాలపై భారత్ ఆశలు పెట్టుకుంది. కానీ చివరకు ఆరు పతకాలకే పరిమితం అయ్యింది. ఒక్క స్వర్ణాన్ని కూడా సాధించలేకపోయింది. ఇలా దేశంలో క్రీడల పరిస్థితి ఎలా వుందో తాజా ఒలింపిక్స్ బయటపెట్టింది. కేవలం క్రికెట్ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు... ఇతర క్రీడలను పట్టించుకోవడం లేదు. దీని ఫలితమే విశ్వ వేదికలపై భారత్ కు అవమానకర పరిస్థితి. ఈ పరిస్థితి మారుస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది... తాజాగా సీఎం రేవంత్ రెడ్డి క్రీడాభివృద్దికి సంబంధించి కీలక ప్రకటన చేసారు. 
 
తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నుండే ఈ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఒలింపిక్స్ లో మనదేశం చాలా నిరాశ పర్చింది... భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి వుండకూడదనే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్ లో దేశానికి అత్యుత్తమ క్రీడాకారులను తెలంగాణ అందిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక పతకాలు సాధించే లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీ పనిచేస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. 

ఇక కేవలం విద్యే కాదు నైపుణ్యం చాలా ముఖ్యం... ఇది లేకపోవడం వల్లే నిరుద్యోగ సమస్య పెరుగుతోందని సీఎం అన్నారు. రాష్ట్రంలో కేవలం సర్టిఫికెట్ కోర్సులకే విద్య పరిమితమవుతోంది...చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. అందుకే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ యూనివర్సిటీ నిర్వహణకు ఇండస్ట్రీ డ్రివెన్ విధానం తీసుకున్నామని...అందుకే ఆనంద్ మహీంద్రాను చైర్మన్ గా నియమించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 20వేల మందికి స్కిల్ యూనివర్సిటీ శిక్షణ అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

Latest Videos

ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా వసతిగృహాల్లో సరైన మౌలిక వసతులు ఉండటం లేదని సీఎం అన్నారు. అందుకే అన్నిరకాల మౌలిక వసతులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామని... ప్రతీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వీటిలో జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

ఇప్పటికే భారీ ఉద్యోగాల భర్తీ చేపట్టినట్లు తెలిపిన సీఎం పది పదిహేను రోజుల్లో అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలలో బోధనా, బోధనేతర ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇంకా విద్యాశాఖలో భారీగా ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ సాగుతోందని...  మిగతా అనేక శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 


 

click me!