ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే మూసీ అభివృద్ధి, ప్రక్షాళన తదితర అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం.
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ .. బీఆర్ఎస్, బీజేపీల నుంచి ప్రభుత్వానికి ముప్పు పొంచి వుందన్నది బహిరంగ రహస్యం. ఓ ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు వుంటే చాలు కేసీఆర్ గేమ్ ఏ రేంజ్‌లో వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి అత్యవసరం. ముందు తన టీమ్‌ను సెట్ చేసుకోవడంతో పాటు ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టిన ఆయన తర్వాత తన ఆట మొదలుపెట్టే అవకాశం వుంది.
బీఆర్ఎస్‌కు జాన్ జిగ్రీ అయిన ఎంఐఎంతో దగ్గరయ్యేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఊహించుకోవచ్చు. ప్రొటెం స్పీకర్‌గా ఆ పార్టీ అగ్రనేత , డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేసిన రేవంత్ మజ్లిస్‌ను బీఆర్ఎస్ నుంచి లాగేసుకునేందుకు తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసినట్లుగా కనిపిస్తోంది.
దీనిలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే మూసీ అభివృద్ధి, ప్రక్షాళన తదితర అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలిసారిగా ఎంఐఎం ఎమ్మెల్యేలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహాతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు , ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
కాగా.. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ నేతల విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. తొలి రోజు నుంచే దీనిపై బీజేపీ రగిలిపోతూ వుండగా.. ఏకంగా కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్నే బహిష్కరించింది. స్పీకర్ సీట్లో అక్బరుద్దీన్ వుండగా తాము ప్రమాణం చేసేది లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తేల్చిచెప్పారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికే కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ పదవిని కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. ప్రొటెం స్పీకర్‌గా అసెంబ్లీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేని నియమిస్తారని, కానీ ఈ విషయంలో సీనియారిటీని కాంగ్రెస్ పట్టించుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక వెనుక రాజకీయ కారణాలు వున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఎవరి పేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని లక్ష్మణ్ తెలిపారు.