Dharani Portal : చెప్పినట్లే చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ధరణి పోర్టల్‌పై కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Dec 13, 2023, 7:40 PM IST
Highlights

ధరణి పోర్టల్‌ను రూపొందించే బాధ్యత ఎవరికి ఇచ్చారు.. టెండర్ పిలిచారా.. ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్ క్రియేట్ చేశారని అధికారులను ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . ధరణి పోర్టల్‌పై సమగ్ర అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు వాడి వేడి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని వ్యాఖ్యానించారు. దీంతో కేసీఆర్ సైతం ధరణిని అలా చేస్తారంట.. ఇలా చేస్తారంట అంటూ కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడి చేసేవారు. కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. దీనిపై బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

ధరణి పోర్టల్‌ను రూపొందించే బాధ్యత ఎవరికి ఇచ్చారు.. టెండర్ పిలిచారా.. ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్ క్రియేట్ చేశారని అధికారులను ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 18 లక్షల 46 వేల 416 మందికి ఇంకా పాస్‌ పుస్తకాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. 2,31,424 దరఖాస్తులు టీఎం 33, టీఎం 15కి చెందినవని.. అవి పెండింగ్‌లో వున్నాయని ఆయన పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌పై సమగ్ర అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ధరణి పోర్టల్‌లో చాటా డేటా తప్పులు, పాస్ పుస్తకాల్లో తప్పులు సరిదిద్దాలని రేవంత్ రెడ్డి సూచించారు. ధరణికి అసలు చట్టబద్ధత ఏంటని ఆయన ప్రశ్నించారు. సాదా బైనామాల్లో తప్పులను తొలగించాలని.. భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కంప్యూటర్లను నమ్ముకోవద్దని.. రికార్డులు రాయాలని రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

click me!