తన కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ఓ దళిత యువకుడి హత్యకు కుట్రపన్న అడ్డంగా బుక్కయ్యాడు ఓ కౌన్సిలర్. యువకుడిని యాక్సిడెంట్ చేసి చంపేందుకు ప్రయత్నించిన సుపారీ గ్యాంగ్ పోలీసుల అదుపులో వుంది.
ఆదిలాబాద్ : రాతియుగం నుండి కంప్యూటర్ యుగానికి వచ్చాం... దేశాన్ని దాటేందుకు భయపడ్డ స్థాయినుండి చంద్రుడిపైకి చేరుకునే స్థాయికి చేరుకున్నాం. కానీ కొందరు ఇంకా కులమతాల మాయలో అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. సాటి మనుషులను తక్కువచేస్తూ అగ్రకుల దురహంకారంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఓ రాజకీయ నాయకుడు సంకుచిత మనస్తత్వంతో ఆలోచించి ఓ యువకుడిని అంతమొందించేందుకు ప్రయత్నించాడు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దుర్గానగర్ వార్డ్ కౌన్సిలర్ రఘుపతి కూతురిని దళిత యువకుడు ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం చాలాకాలంగా కొనసాగుతుండగా ఇటీవలే రఘుపతికి తెలిసిందే.దీంతో తన కూతురితో మరోసారి కనిపిస్తే చంపేస్తానంటూ రఘుపతి ఎస్సీ యువకుడు వంశీని బెదిరించాడు... తన కూతురిని కూడా తీవ్రంగా హెచ్చరించాడు.
అయితే రఘుపతి బెదిరింపులను ఇటు కూతురు, అట ఆమె ప్రియుడు పట్టించుకోలేదు. ఎప్పటిలాగే ప్రేమికులిద్దరూ కలుసుకుంటుండటంతో రఘుపతి కోపం కట్టలుతెంచుకుంది. తన కూతురు ఓ ఎస్సీ యువకుడిని ప్రేమిస్తోందని బయట తెలిస్తే పరువుపోతుందని భావించిన కౌన్సిలర్ దారుణానికి ఒడిగట్టాడు. వంశీని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ను ఆశ్రయించాడు.
ఆదిలాబాద్ పట్టణానికే చెందిన రవి చౌహాన్ గ్యాంగ్ తో రవి హత్యకు రూ.15 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం కావడంతో కాస్త వేచిచూసిన వీళ్లు ఇటీవల హత్య ప్లాన్ ను అమలుచేసారు. ముందుగానే వంశీ కదలికలపై నిఘా పెట్టిన రవి గ్యాంగ్ యాక్సిడెంట్ చేసి చంపాలని నిర్ణయించకున్నారు. ఇలా ఈ నెల 18న స్కూటీపై వెళుతున్న వంశీని వెనకాల నుండి ఓ కారుతో ఢీకొట్టారు. అతడు చనిపోయి వుంటాడని భావించి కారును ఆపకుండా వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో పడివున్న వంశీని స్థానికులు హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాలు దక్కాయి.
ఈ యాక్సిడెంట్ పై వంశీ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఇది రోడ్డు ప్రమాదం కాదు హత్యాయత్నమని పోలీసులు గుర్తించారు. సుఫారీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారించగా అసలునిజం బయటపెట్టారు. విషయం బయటపడినట్లు తెలిసి కౌన్సిలర్ రఘుపతి పరారవగా అతడికోసం గాలిస్తున్నారు.