CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తినకు వెళ్లనున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ దొరకడంతో సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరనున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు(డిసెంబర్ 26) సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. పీఎం మోడీ అపాయింట్ ఫిక్స్ దొరకడంతో సీఎం, డిప్యూటీ సీఎం లు రేపు మధ్యాహ్నం ప్రత్యేక ఫ్లైట్ లో హస్తినకు బయలుదేరనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవనున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీగానూ తెలుస్తోంది.
ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు పూర్తై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిగా ఎవరు ఉంటే వారిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. కాగా.. ఈ ప్రత్యేక భేటీలో విభజన సమస్యలతో పాటు పెండింగ్యలో ఉన్న ప్రాజెక్టులు, వాటి అనుమతులపై ప్రధానితో చర్చించనున్నారు. అలాగే.. కేసీఆర్ పాలనలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ప్రధాని మోడీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
అంతేగాక గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను కూడా ప్రధాని మోడీకి సీఎం, డిప్యూటీలు వివరించే అవకాశం లేకపోతేదు. అలాగే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోని శ్వేతపత్రాలపైనా చర్చించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు.
అలాగే విభజన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బకాయిలు సుమారు 700 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ అంశంపై కూడా ప్రధాని మోడీతో చర్చించే అవకాశముంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ ట్వీట్ లో తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజల తీర్పును స్వాగతిస్తామంటూనే.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. సీఎం, డిప్యూటీ సీఎంలు అధికార హోదాలో ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యే చాన్స్ ఉంది. ఒక్కవేళ భేటీ అయితే.. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చలు జరపనున్నట్లు టాక్.