16 మంది ప్రధానులు చేసిన అప్పులెన్ని? ఒక్క మోదీ చేసిందెంత? : రేవంత్ రెడ్డి ఆసక్తికర లెక్కలు

By Arun Kumar P  |  First Published Aug 22, 2024, 5:22 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రోడ్డెక్కారు.  అదిష్టానం పిలుపుమేరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన అప్పులలెక్కలు బైటపెట్టారు రేవంత్.  ఆ లెక్కలు ఇలా వున్నాయి... 


Hyderabad : మోదీ సర్కార్ ప్రజాధనాన్ని అదానీకి దోచిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది.యూఎస్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ రిసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ కూడా కార్పోరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి  అదానీ సంస్థ పాల్పడిందని ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు తాజాగా సెబీ (సెక్యూరిటీస్ ఆండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చీఫ్ మాధవి పురి బచ్ ను కూడా ఈ కుంభకోణంలోకి లాగింది హిండెన్ బర్గ్. అదానీ గ్రూప్ షేర్లను ఆర్టిఫిషియల్ గా పెంచడంలో మాధవి పురి బచ్ భర్త ధవల్ కీలకపాత్ర పోషించారని హిండెన్ బర్గ్ బైటపెట్టింది. ఇలా అదాని, సెబీ చీఫ్ కుమ్మక్కయి భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ ఆరోపణలతో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. 

అదానీ మెగా కుంభకోణంపై సమగ్ర విచారణ జరపించాలని,  సెబి ఛైర్మన్ అక్రమాలపై జేపిసి (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు నేడు(గురువారం) దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఏఐసిసి.... దేశంలోని అన్ని ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కార్యాలయాల ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేపట్టాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మోదీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు. 

Latest Videos

undefined

కాంగ్రెస్ పాలనలోనే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని సీఎం రేవంత్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయ రంగ అభివృద్దికి దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పాటుపడ్డారని అన్నారు. ఇక బ్యాంకుల జాతీయీకరణను చేపట్టి ఆర్థికరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధిది అంటూ కొనియాడారు. ఇలా పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే కాదు ఇంకెన్నో అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేసారు. పేదలకు ప్రభుత్వ భూములు పంచింది కూడా ఇందిరా గాంధీ అని రేవంత్ పేర్కొన్నారు.

ఇక దేశాన్ని సాంకేతిక విప్లవం వైపు నడిపింది రాజీవ్ గాంధి అని... ఆయన ప్రధానిగా వుండగా తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్న సాంకేతికతకు బాటలు వేసాయన్నారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టిన మహానేత రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ కొనియాడారు. 

ఇలా కాంగ్రెస్ ప్రధానులు దేశంకోసం ఎంతో చేసారని... ఫలితంగానే ఇప్పుడీ పరిస్థితులు వున్నాయన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఈ పదేళ్లలో చేసిన అభివృద్ది ఏమీలేదు... కానీ అప్పులు మాత్రం భారీగా పెంచారని రేవంత్ ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి 2014 వరకు పనిచేసిన అందరు ప్రధానులు కలిపి రూ.55వేల కోట్ల అప్పు చేసారు... కానీ  గత పదేళ్లలో మోదీ ఒక్కరే లక్షా 15 వేల కోట్ల రూపాయల అప్పులు చేసారని ఆరోపించారు. అంటే 16 మంది ప్రధానులు చేసిన అప్పుకంటే మోదీ రెండింతల అప్పులు చేసారని... ఈ భారం చివరికి పడేది ప్రజలపైనే అని రేవంత్ ఆందోళన వ్యక్తం చేసారు. 

కేవలం దేశాన్నే కాదు ప్రపంచాన్నే దోచుకునేలా మోదీ, అమిత్ షా ల వ్యవహార తీరు వుందని రేవంత్ ఎద్దేవా చేసారు. దుష్టచతుష్టయం  దేశాన్ని దోపిడీ చేస్తోందన్నారు. దేశానికి బీజేపీ ముప్పుగా మారింది... ఈ ముప్పును తొలగించాల్సిన బాధ్యత ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని రేవంత్ పేర్కొన్నారు. 

తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ ఛైర్ పర్సన్ మాధవి పురి బచ్ తక్షణమే రాజీనామా చేయాలి... లేదంటే కేంద్ర ప్రభుత్వమే ఆమెను తొలగించాలని రేవంత్ డిమాండ్ చేసారు. అదానీ మెగా కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే... అందుకే తాను ముఖ్యమంత్రినైనా ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని రేవంత్ అన్నారు. 

అదానీ కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు? అని రేవంత్ నిలదీసారు. వాళ్లు విలీనమైతరో... మలినమైతరో మాకు సంబంధం లేదు... కానీ దేశ సంపదను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఈ దోపిడీ పై ఎందుకు మాట్లాడటంలేదని అడిగారు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. జేపీసీ ఏర్పాటుపై బీఆర్ఎస్ విధానాన్ని స్పష్టం చేయాలని రేవంత్ కోరారు. 

click me!