హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు.. కిరాణ దుకాణంలో యథేచ్ఛగా విక్రయాలు

By Galam Venkata Rao  |  First Published Aug 19, 2024, 2:22 PM IST

హైదరాబాద్‌లో గంజాయి కలిపిన చాక్లెట్లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూపీ నుంచి వాటి తీసుకొస్తున్నట్లు గుర్తించారు.


హైదరాబాద్‌లో గంజాయి కలిపిన చాక్లెట్ల విక్రయాల గుట్టు రట్టయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో తయారైన ఈ గంజాయి చాక్లెట్లు.. 'ఆయుర్వేద' ఔషధంలా హైదరాబాద్‌లోకి వస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌తో ఉన్న ఈ చాక్లెట్ల రేపర్‌లపై 'ఆయుర్వేద ఔషధ్' అని ముద్రించి ఉంది. హైదరాబాద్‌ నగర పరిధిలోని పేట్‌బషీరాబాద్‌లోని ఓ కిరాణా దుకాణంలో సైబరాబాద్ పోలీసులు వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

ముందుగా పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు.. యూపీకి చెందిన పివేష్ పాండే నిర్వహిస్తున్న కోమల్ కిరాణా స్టోర్‌పై దాడి చేసి ఈ చాక్లెట్లను సీజ్‌ చేశారు. 200 వరకు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.
ఈ 'ఆయుర్వేద ఔషధ్' యూపీ అంతటా సులువుగా లభ్యమవుతుందని, డయాబెటిస్‌కు ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారని పోలీసుల విచారణలో పాండే తెలిపాడు. 
ప్యాకింగ్‌పై ముద్రించిన వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల్లో ప్రతి 100 గ్రాముల చాక్లెట్‌లో 14 గ్రాముల గంజాయి ఉంది. 'చాక్లెట్'ను నీటిలో కలిపి అజీర్ణం, ఇతర కడుపు సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి రోజుకు రెండుసార్లు తినవచ్చని కూడా అందులో పేర్కొన్నారు. అయితే, ఇందులో వాస్తవమెంతో తెలియదు.

Latest Videos

undefined

వలస కార్మికులే కస్టమర్లు...

‘స్టోర్ యజమాని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవాడు. కాగా, కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. గడిచిన ఆరు నెలలుగా గంజాయి కలిపిన చాక్లెట్‌లను దుకాణంలో విక్రయిస్తున్నాడు’ అని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. పాండే స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి ఈ గంజాయి 'చాక్లెట్లు' కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చేవాడు. అతని కస్టమర్లలో ఎక్కువ మంది పొరుగున నివసిస్తున్న వలస కూలీలు, కార్మికులేనని చెప్పారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TG-ANB) ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో గంజాయి కలిపిన 'చాక్లెట్'ల తయారీదారులను గుర్తించింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసింది. 

click me!