Revanth Reddy: అమిత్‌ షాతో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. కేంద్రానికి పలు విజ్ఞప్తులు .. 

By Rajesh Karampoori  |  First Published Jan 4, 2024, 10:47 PM IST

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.


Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. తెలంగాణకు ఎక్కువ మొత్తంలో ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రిని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. 

అంతకుముందు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సబంధించిన విభజన అంశాలు, నిధుల రాకపై  చర్చించారు. ఆ తర్వాత కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి కలిశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (పీఎల్‌ఆర్‌ఐ) పథకానికి జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 
 
పిఎల్‌ఆర్‌ఐ పథకానికి జాతీయ హోదాతో పాటు.. పిఎల్‌ఆర్‌ఐని చేపట్టేందుకు 60 శాతం నిధులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రికి వినతి పత్రం అందించారు. 1,226 గ్రామాలకు తాగునీరుతో పాటు 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించినట్టు తెలిపారు. కృష్ణా జలాల ప్రాతిపదికన తెలంగాణకు కేటాయింపుల నుంచి ప్రాజెక్టుకు 75 శాతం డిపెండబిలిటీతో 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు రూపకల్పన చేసినట్లు కేంద్ర మంత్రికి సమర్పించిన వినతిపత్రంలో తెలిపారు. ఇప్పటికే అటవీ, వన్యప్రాణులు, పర్యావరణ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అనుమతులు లభించాయని తెలిపారు.

Latest Videos

హైడ్రాలజీ, నీటిపారుదల ప్రణాళిక , వ్యయ అంచనా,  BC నిష్పత్తి, అంతర్రాష్ట్ర అంశాల క్లియరెన్స్‌లు CWC, న్యూఢిల్లీలోని వివిధ డైరెక్టరేట్‌లలో పరిశీలనలో ఉన్నాయని నీటిపారుదల మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రులను కలవడమే కాకుండా.. తదుపరి లోక్‌సభ ఎన్నికల వ్యూహం మరియు ఇండియా బ్లాక్ పార్టీలతో సీట్ల పంపకాల గురించి చర్చించడానికి ముఖ్యమంత్రి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని కలువనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి శుక్రవారం యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమై కొన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

click me!