తెలంగాణ సచివాలయానికి ముహుర్తం ఫిక్స్: జనవరి 18న ప్రారంభించనున్నకేసీఆర్

By narsimha lodeFirst Published Nov 28, 2022, 5:25 PM IST
Highlights

తెలంగాణ  కొత్త సచివాలయం  ప్రారంభానికి ముహుర్తం  ఖరారైంది.  వచ్చే  ఏడాది  జనవరి 18న  కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. తన చాంబర్  లో ప్రత్యేక  పూజలు  నిర్వహించి  కేసీఆర్  పాలన సాగిస్తారు. 


హైదరాబాద్: వచ్చే  ఏడాది  జనవరి  18న  తెలంగాణ  రాష్ట్ర కొత్త  సచివాలయం ప్రారంభం కానుంది.   ఈ లోపుగా పనులను  పూర్తి  చేయాలని సీఎం  కేసీఆర్ అధికారులను  ఆదేశించారు.  జనవరి  18న  సచివాలయంలోని  ఆరో  అంతస్తులోని  తన  బ్లాక్ ను  సీఎం  ప్రారంభించనున్నారు. తన  చాంబర్  లో  ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త  సచివాలయం నుండి పాలనను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

2020  జూలై  మాసంలో  తెలంగాణ  పాత  సచివాలయం కూల్చివేత  పనులను ప్రభుత్వం ప్రారంభించింది.  సచివాలయం కూల్చివేతపై  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  సహా పలువురు  హైకోర్టులో పిటిషన్లను  దాఖలు  చేశారు. అయితే  ఈ పిటిషన్లను  విచారించిన  తర్వాత  హైకోర్టు  కూల్చివేతకు  గ్రీన్  సిగ్నల్  ఇచ్చింది.  దీంతో  సచివాలయ కూల్చివేత  పనులను త్వరగా పూర్తి చేసిన సర్కార్  నిర్మాణ పనులను  అదే  స్పీడుతో  ప్రారంభించింది.  మూడు షిప్టుల్లో  సచివాలయం నిర్మాణ పనులను  చేపట్టింది  తెలంగాణ  ప్రభుత్వం.

2019  జూన్  27వ  తేదీన  కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన  చేశారు. 6 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త  సచివాలయాన్ని  నిర్మించాలని  ప్రభుత్వం  తలపెట్టింది.  9 మాసాల్లో  ఈ  భవన నిర్మాణాన్ని  పూర్తి  చేయాలని ప్రభుత్వం  తలపెట్టింది.  అయితే  కరోనాతో  పాటు  ఇతర  కారణాలతో  సచివాలయ నిర్మాణం ఆలస్యమైంది.
 

click me!