రేపటి నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ పాదయాత్ర.. హైకోర్టు షరతులతో రీషెడ్యూల్..

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 4:20 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను రేపటి నుంచి ప్రారంభించనున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను రేపటి నుంచి ప్రారంభించనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈరోజు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర  ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే భైంసాలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించాలని భావించింది. అయితే పాదయాత్రకు, సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాదయాత్ర కోసం నిర్మల్ బయలుదేరిన బండి సంజయ్‌‌ను ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లాలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్‌లో ఆయన నివాసానికి తరలించారు. 

అయితే బండి సంజయ్  పాదయాత్రకు, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ పిటిషన్‌‌పై విచారణ జరిపిన హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే బండి సంజయ్ పాదయాత్రను రీషెడ్యూల్ చేశారు. అయితే హైకోర్టు షరతుల మేరకు నేడు బహిరంగ సభ నిర్వహించేందుకు సమయం లేకపోవడంతో.. సభతో పాటు, పాదయాత్రను కూడా రేపటి నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. బండి సంజయ్ పాదయాత్రను రేపట్నుంచి ప్రారంభించనున్నట్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు సూచనల మేరకు సభ, పాదయాత్రను రీషెడ్యూల్ చేసినట్లు చెప్పారు. ఈ రోజు సమయం లేనందున సభను కూడా మంగళవారమే నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టుకు మనోహర్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.

ఇదిలా ఉంటే.. భైంసా పట్టణంలోకి వెళ్లకుండా పాదయాత్ర వెళ్లకుండా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే భైంసా పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో సభ నిర్వహించాలని స్పష్టం చేసింది. నేతలు, కార్యకర్తలు, ఇతర మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని హైకోర్టు ఆదేశించింది. 3 వే మందితో సభ జరుపుకోవాలని సూచించింది. 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే సభను నిర్వహించాలని ఆదేశించింది. కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని తెలిపింది. 

ఇక, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. ఐదు జిల్లాల్లోని మూడు లోక్‌సభ, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర యాత్ర సాగాల్సి ఉంది. 

సంబరాల్లో బీజేపీ శ్రేణులు.. 
ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. భైంసాకు బండి సంజయ్‌ను దూరం చేశారేమో.... కానీ భైంసా ప్రజల నుండి బండి సంజయ్ ను దూరం చేయలేరని అన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా బండి సంజయ్ నుంచి బైంసా ప్రజలను వేరు చేయలేరని చెప్పారు. బైంసాకు ఎందుకు వెళ్లకూడదు? బైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా? అని ప్రశ్నించారు.

 

click me!