ఏపీ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర.. బాంబుపేల్చిన కేసీఆర్, జగన్‌కు అలర్ట్

By Siva Kodati  |  First Published Nov 3, 2022, 10:31 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అప్రమత్తం కావాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు. 
 


మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పందించారు. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ, కేంద్ర పెద్దలను ఏకిపారేద్దామని ఆయన భావించారు. కానీ ఎందుకో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న సీఎం.. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అనేక కీలక అంశాలను ప్రస్తావించిన ఆయన.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పటి వరకు 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిందని చెప్పారు. ఇదే సమయంలో ఢిల్లీ, తెలంగాణ, రాజస్ధాన్, ఏపీ ప్రభుత్వాలు కూడా కేంద్రం హిట్ లిస్ట్‌లో వున్నాయని.. వీటిని ఒక్కొక్కటిగా కూల్చివేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని కేసీఆర్ ఆరోపించారు. 

పైన చెప్పిన నాల్గింటిలో మూడు చోట్ల బీజేపీ అంటే అస్సలు గిట్టని కేజ్రీవాల్, కేసీఆర్, అశోక్ గెహ్లాట్‌లు అధికారంలో వున్నారు. కానీ జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా కుట్ర జరుగుతోందని కేసీఆర్ చెప్పడమే ఇక్కడ అనుమానించాల్సిన వ్యవహారం. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏనాడూ కూడా కేంద్రాన్ని కానీ , బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేదు. తన రోజువారీ ఖర్చులకు, సంక్షేమ పథకాలకు అవసరమైన డబ్బు కోసం అప్పు పుట్టకుండా చేసినా ఎన్నో బిల్లుల సమయంలో బీజేపీ వైపే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. 

Latest Videos

ALso REad:దొరికిన దొంగలు వీళ్లే : ఒక్కొక్కడికి మూడు నాలుగు ఆధార్లు, పాన్ కార్డులు ... చిట్టా విప్పిన కేసీఆర్

ఎన్డీయేలో చేరకపోయినా.. ఎన్డీయే మనిషిలాగే ఆయన వ్యవహరించారని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తూ వుంటుంది. అలాంటి జగన్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలుస్తుందా అంటే ..? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ.. శాశ్వత శత్రువులు కానీ వుండరని పెద్దలు చెబుతూ వుంటారు. దీనిని బట్టి కాషాయ దళం ఆ పని చేయకుండా వుంటుందా అంటే చెప్పలేం. రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా తెగించే తత్వం నేటి బీజేపీది. 

శివసేనను నిట్టనిలువునా చీల్చి.. అనేక మిత్రపక్షాలను తనలో కలపేసుకుంది బీజేపీ. 151 మంది ఎమ్మెల్యేల బలంతో పటిష్ట స్థితిలో వున్న జగన్‌ను.. 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా కదిలించలేరు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ కీలకనేత తిరుగుబాటు చేస్తారని బీజేపీ అనుకూల ఓ జాతీయ ఛానెల్‌లో అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిని అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ అప్రమత్తం కావాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

click me!