మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన నిందితుల వివరాలను కేసీఆర్ మీడియాకు తెలిపారు. తన దగ్గర ఉన్నవి ఆషామాషీ ఆధారాలు కావని, ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఫాంహౌస్ వ్యవహారంలో పట్టుబడ్డ వివరాలను కేసీఆర్ మీడియాకు వివరించారు. ఒకే వ్యక్తికి నాలుగైదు ఆధార్ కార్డులు వుంటాయని.. వ్యక్తి పేరు మాత్రమే మారుతుందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు రెండు మూడు వుంటాయని.. ఇవన్నీ కోర్టుకు సమర్పించామని కేసీఆర్ పేర్కొన్నారు. వీళ్లకు ఫేక్ ఐడీ కార్డులు ఎలా వచ్చాయని సీఎం ప్రశ్నించారు. తాను చూపించే వీడియోలు చూస్తే జనం నివ్వెరపోతారని అన్నారు.
అవసరమైతే దేశం కోసం చనిపోతామని.. ప్రజాస్వామ్యాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. న్యాయవ్యవస్థకు చేతులు జోడించి చెబుతున్నానని.. తన దగ్గర ఉన్నవి ఆషామాషీ ఆధారాలు కావని, ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తుషార్ అనే వ్యక్తి దేశ హోంమంత్రికి సన్నిహితుడని.. రాహుల్ గాంధీపై గత ఎన్నికల్లో పోటీ చేశారని సీఎం తెలిపారు. ఇది సింగిల్ కేసులా న్యాయవ్యవస్థ చూడవద్దని.. 24 మంది ముఠా వున్నామని వాళ్లే చెబుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. మఠాధిపతుల రూపాలు, వేషాలు .. చేసేది మాత్రం దుర్మార్గ పనులని ఆయన దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలు, మేధావులేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. కుట్రను బద్ధలు కొట్టాని తమ ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారని.. అందుకే వారి రహస్యాలు బట్టబయలు అయ్యాయని సీఎం అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను ఎలా కూల్చామో చెబుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. ఈడీ, ఐటీ కూడా మీపైకి రాదని చెబుతున్నారని ... అలా చెప్పడానికి వీరెవరని సీఎం ప్రశ్నించారు. ప్రలోభాలు పెట్టేందుకు 24 మంది వున్నారని.. ఈ దొంగల ముఠాకు డబ్బు ఎవరిస్తున్నారని కేసీఆర్ నిలదీశారు. ఓ కేంద్ర మంత్రి మీరు ఎమ్మెల్యేలను కొనలేదా అంటున్నారని.. తాము 88 సీట్లు గెలిచామని, మూడింట రెండోవంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే వాళ్లను కలుపుకున్నామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూల్చుతామంటే నేను ఊరుకోవాలా అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చితే పార్టీలకు అతీతంగా పోరాటం చేశామని సీఎం గుర్తుచేశారు. ఐతే గోడీ, లేదంటే ఈడీ అని అంటున్నారని.. కర్ణాటకలో ఎమ్మెల్యేలను ఎలా తరలించారో వాళ్లు చెబుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కూలీలుగా ఎలా తరలించామో చెప్పారని.. వీడియోల్లో అమిత్ షా పేరు 20 సార్లు చెప్పారని సీఎం తెలిపారు. ప్రధాని మోడీ పేరు కూడా ఒకటి రెండు సార్లు చెప్పారని కేసీఆర్ చెప్పారు. న్యాయవ్యవస్థకు దండంపెట్టి కోరుతున్నానని.. దేశం ప్రమాదంలో పడ్డప్పుడు న్యాయవ్యవస్థే కాపాడిందని సీఎం గుర్తుచేశారు.
నేరస్తులు ఎవరైనా శిక్ష పడాలి అని కేసీఆర్ అన్నారు. వీళ్ల ఫోన్లను పోలీసులు సీజ్ చేసి కాల్ డేటా అంతా తీశారని సీఎం చెప్పారు. వీళ్లు ఎవరెవరితో మాట్లాడారో ఆ చరిత్రంతా వచ్చిందని.. ఆ వివరాలు అంతా 70, 80 వేల పేజీలు అవుతాయన్నారు. వాళ్ల కాల్ డేటా వేల పేజీల్లో వుందని.. నిజమైన దొంగలు దొరికే వరకు అందరూ పరిశోధించాలని సీఎం పేర్కొన్నారు. అందుకే అన్ని న్యూస్ ఏజెన్సీలకు ఆ వివరాలు పంపించానని ... దీనిపై అంతా కలిసి యుద్ధం చేయాల్సిందేనని కేసీఆర్ పిలుపునిచ్చారు.
దేశంలోని అన్ని పత్రికా సంస్థలకు ఈ వీడియోలు పంపానని.. ఎదురులేని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ప్రజాగ్రహానికి గురయ్యారని కేసీఆర్ గుర్తుచేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు , పార్టీల అధ్యక్షులకు వీడియోలు పంపుతానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ హైకోర్టుకు ఫాంహౌజ్ ఫైల్స్ ఇప్పటికే పంపించానని .. దేశంలోని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టుకు ఈ వీడియోలను పంపుతానని సీఎం తెలిపారు. బెంగాల్ వెళ్లి ఎమ్మెల్యేలు టచ్‌లో వున్నారని స్వయంగా ప్రధానే చెప్పారని ... ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశం దెబ్బతింటే తీవ్రంగా నష్టం జరుగుతుందని.. గత నెలలో ఇక్కడికి రామచంద్ర భారతి వచ్చారని సీఎం తెలిపారు.
తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారని కేసీఆర్ అన్నారు. ఫాంహౌజ్ ఫైల్స్ మూడు గంటలు వున్నాయని.. కోర్టుకు మొత్తం వీడియో ఫుటేజ్‌లు సమర్పించామని కేసీఆర్ తెలిపారు. 8 ప్రభుత్వాలను ఇప్పటికే ఈ దేశంలో కూల్చామని వీడియోలో అంటున్నారని.. మరో నాలుగు ప్రభుత్వాలను కూల్చుతామని చెబుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూల్చుతామని చెబుతున్నారని.. రాక్షసుల కుట్రను బద్ధలుకొట్టాలని ఆ ముఠాను పట్టుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఇది నిన్నా మొన్నా జరిగింది కాదని సీఎం వ్యాఖ్యానించారు.