ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే, కాంగ్రెస్ బాగా పాలిస్తే .. ఎన్టీఆర్ టీడీపీ పెట్టేవారా : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 19, 2023, 05:03 PM IST
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే, కాంగ్రెస్ బాగా పాలిస్తే .. ఎన్టీఆర్ టీడీపీ పెట్టేవారా : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి వుండేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు . ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలు తెలంగాణకు జీవన్మరణ సమస్య అని సీఎం పేర్కొన్నారు. 

మనదేశ ప్రజాస్వామ్యంలో తగినంత పరిణతి రాలేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్ కర్నూలులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రజలలో పరిణతి వస్తేనేప, దేశం రాష్ట్రం, బాగుపడుతుందన్నారు. సరిగా ఆలోచించి ఓటు వేయకపోతే ఆగమైపోతామని కేసీఆర్ హెచ్చరించారు. అభ్యర్ధులతో పాటు వారి పార్టీల చరిత్రను చూసి ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. 

50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని.. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ దుయ్యబట్టారు. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రతో కలిపి ఇబ్బంది పెట్టారని సీఎం ధ్వజమెత్తారు. ఆంధ్రలో కలపడం వల్ల 60 ఏళ్లు ఎన్నో బాధలు పడ్డామని.. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ మళ్లీ సాధించుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. పక్కనే ఉన్నప్పటికీ మహబూబ్‌నగర్  ప్రజలు కృష్ణా జలాలకు నోచుకోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆర్ధిక నిపుణులతో చర్చించి సంక్షేమ పథకాలు రూపొందించామని కేసీఆర్ వివరించారు. రూ.200 ఉన్న పింఛన్లను రూ.2 వేలకు పెంచామని సీఎం గుర్తుచేశారు. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి రైతుబంధు ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ ఉండలేదని .. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకప్పుడు గంజి కేంద్రాలు నడిపారని కేసీఆర్ గుర్తుచేశారు. 

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని.. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి వుండేదని సీఎం ప్రశ్నించారు. పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ పాలమూరు ప్రజలకు సాగునీరు అందలేదని.. మహబూబ్‌నగర్ ఎంపీగా వున్నప్పుడే తెలంగాణ సాధించడం ఎప్పుడూ తన గుండెల్లో నిలిచిపోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అని.. మహబూబ్‌నగర్‌లో పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని సీఎం చెప్పారు. తెలంగాణ వచ్చిన మూడేళ్లలోనే మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. 

రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు అన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, 24 గంటల కరెంట్ కావాలో , వద్దో ఆలోచించాలని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నాని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. ధరణి తీసేస్తే రైతుబంధు, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి తీసేస్తే మళ్లీ అధికారుల లంచాల కాలం వస్తుందని.. ఈ ఎన్నికలు తెలంగాణకు జీవన్మరణ సమస్య అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు, రైతుబీమా పోతాయని కేసీఆర్ హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే