వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు దళిత బంధు.. రేపట్నుంచే రూ.10 లక్షల పంపిణీ: కేసీఆర్ ప్రకటన

By Siva KodatiFirst Published Aug 4, 2021, 5:39 PM IST
Highlights

వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రేపట్నుంచే వారి ఖాతాల్లో రూ.10 లక్షల డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజిబిజీగా గడుపుతున్నారు. కాలినడకన గ్రామమంతా కలియతిరిగిన సీఎం.. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. దళితులు అణిచివేతకు , వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఇంకా పేదరికంలోనే వున్నారని.. దళిత సమాజం కోసం బీఆర్ అంబేడ్కర్ ఎంతో పోరాటం చేశారని సీఎం గుర్తుచేశారు.

అంబేద్కర్ వల్లే రిజర్వేషన్లు వచ్చాయని.. ప్రభుత్వాలు సరైన విధానాలు పాటించకపోవడం వల్లే ఇప్పటికీ దళితులు పేదరికంలో వున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టామని , ఈ పథకాన్ని విఫలం కానివ్వొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. దళితుల్లో ఐకమత్యం రావాలని.. వాసాలమర్రిలో కొత్త ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Also Read:దళితబంధు పథకం అంటే తెలుసా?: వాసాలమర్రివాసులను ప్రశ్నించిన కేసీఆర్

వాసాలమర్రిలో వున్న బీసీలను ఆదుకుంటామని.. గ్రామంలో కబ్జాకు గురైన భూముల వివరాలు సేకరించామని సీఎం తెలిపారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు భూమి ఇస్తామని.. దళితుల భూకమతాలు ఏకీకరణ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పిన సీఎం.. రేపట్నుంచే మీ ఖాతాల్లో రూ.10 లక్షల డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. 
 
 

click me!