ఆరు నెలల్లో పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌‌లు పూర్తి: కేసీఆర్

Siva Kodati |  
Published : Jan 23, 2021, 09:39 PM IST
ఆరు నెలల్లో పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌‌లు పూర్తి: కేసీఆర్

సారాంశం

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి, డిండి ప్రాజెక్టు పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి, డిండి ప్రాజెక్టు పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

పంప్ హౌజ్‌లు, జలాశయాలు, కాల్వలు, సొరంగ మార్గాల పనుల పురోగతిపై అధికారులను అడిగి  తెలుసుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు.

బిల్లుల చెల్లింపుల కోసం తక్షణమే రూ.2వేల కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా నిర్వాసితులకు చట్టప్రకారం పరిహారం అందించి భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 10లక్షల ఎకరాలకు, జూరాలతో మరో 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే మొత్తం మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ఫ్లోరైడ్, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు పనుల వేగాన్ని పెంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు.

బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమై అవసరమైన మోటార్లను వెంటనే తెప్పించి, బిగించే పనులను పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వ్యవహరించాలని సూచించారు.  

రాష్ట్రం ఏర్పాటైనప్పుడు కేవలం 30లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని.. ఇప్పుడు 1.10కోట్ల ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని కేసీఆర్‌ తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని 1.25కోట్ల ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమతోందని.. సాగునీటితో పాటు మిషన్ భగీరథ, పరిశ్రమలకు నీరందించే బాధ్యత కూడా నీటిపారుదల శాఖపైనే ఉందన్నారు.

ప్రాధాన్యం, పరిధి పెరిగిన దృష్ట్యా సమర్థ నిర్వహణ కోసం నీటిపారుదల శాఖను ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకణ చేసినట్లు చెప్పారు. డీఈఈ స్థాయి మొదలు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) వరకు స్థాయి మేరకు ఆర్థిక అధికారాలు బదిలీ చేశామని వెల్లడించారు.

తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా స్థానిక అధికారులే మంజూరు చేసి పనులు నిర్వహించేలా చేసినట్లు వివరించారు. ఇదో చరిత్రాత్మక నిర్ణయమని.. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదన్నారు.

ఈ అధికారాలను సద్వినియోగం చేసుకుని చిన్నచిన్న పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu