కేసీఆర్ మారిపోతాడంట.. మా మెడికల్ కాలేజ్ మాగ్గావాలె: జగ్గారెడ్డి

By Siva KodatiFirst Published Jan 23, 2021, 4:13 PM IST
Highlights

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ ఏడాది పోతే జమిలి ఎన్నికలు అంటున్నారని, ఎన్నికలు వచ్చాయంటే మళ్లీ వాయిదా పడుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ ఏడాది పోతే జమిలి ఎన్నికలు అంటున్నారని, ఎన్నికలు వచ్చాయంటే మళ్లీ వాయిదా పడుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ మారిపోతున్నారని ప్రచారం జరుగుతోందని.. కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ ఇచ్చినమాట అమలవుతుందో లేదోనంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ పంచాయతీ మళ్లీ మొదటికే వస్తుందని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. 

అంతకుముందు నిన్న మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటుంటాడని... కేసీఆర్ చేసిన తప్పేందో మాత్రం చెప్పడని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్ మాటలు వినీవినీ బోరు కొడుతోందని చెప్పారు.

అలాగే, ఏ ఆధారంతో కేసీఆర్ ను జైల్లో పెడతారని టీఆర్ఎస్ నాయకులు కూడా అడగరని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది పాలోళ్ల పంచాయతీ అని విమర్శించారు.

అన్నదమ్ముల పిల్లలు సాధారణంగా పగలంతా కొట్టుకుంటూ ఊరంతా పరేషాన్ చేస్తుంటారని... రాత్రి కాగానే అందరూ కల్లు దుకాణం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారని... ఈ పార్టీలది కూడా అదే తీరు అని దుయ్యబట్టారు.

కేసీఆర్ ఇచ్చిన హామీలపై బండి సంజయ్ మాట్లడటం లేదని... ఇదే విధంగా ప్రతి పేదవాడి బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోదీని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించరని జగ్గారెడ్డి అన్నారు.

ఒకరి హామీల గురించి మరొకరు మాట్లాడకూడదనేదే ఈ పార్టీల మధ్య ఉన్న ఒప్పందమని విమర్శించారు. ఈ మూడు పార్టీలు పగలు కొట్టుకుంటూ, రాత్రి మాట్లాడుకుంటాయని దుయ్యబట్టారు. ప్రజల కోసం పని చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.

click me!