రాష్ట్ర సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రయోజనాల కోసం యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు
నీటి పారుదలశాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సీఎం సమాలోచనలు చేశారు. నిన్న కూడా ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్... రాష్ట్ర సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రానికి హక్కుగా కేటాయించిన న్యాయమైన నీటి వాటాలకు సంబంధించి బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పులపై సమావేశంలో చర్చించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపైనా చర్చించారు. గోదావరి, కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకు ఉండే నీటి వాటాపైనా విస్తృతంగా చర్చించారు. బోర్డుల సమావేశంలో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
undefined
Also Read:పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు, కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
కాగా, కృష్ణానదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం శనివారం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సాగునీటి అవసరాల కోసం తరలింపు ఆపాలన్న ప్రభుత్వం .. ఏపీ తన పరిమితిని మించి నీరు తీసుకుంటోందని ఆరోపించింది. ఏపీ ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందన్న ప్రభుత్వం .. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలను మాత్రమే ఏపీ తీసుకోవాలని తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖకు కూడా లేఖ ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం పంపింది.