
గత కొన్ని రోజులుగా తెలంగాణలో (telangana rains) ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ (hyderabad) నగరం తడిసిముద్ధవుతోంది. ఇక్కడ కూడా నాళాలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) బుధవారం ప్రగతి భవన్ లో అధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వరదలు, వర్షాల వల్ల కలిగే ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించాలని సూచించారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోలపై సీఎం ఆరా తీశారు. మహారాష్ట్రలో గోదావరి నుంచి వస్తున్న వరదను అంచనా వేసి చర్యలు చేపట్టాలని .. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read:భారీ వర్షాలతో 2,222 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం.. అధికారులకు మంత్రి ఎర్రబెల్లి కీలక ఆదేశాలు..
మరోవైపు .. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ నిండుకోవడంతో అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆదేశించారు. వర్షాల కారణంగా కొట్టుకుపోతున్న రహదారులకు తక్షణం మరమ్మత్తులు చేయాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్.
అటు వర్షాలు, వరదల కారణంగా సింగరేణి గనుల్లోకి నీరు వస్తుండటంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. బొగ్గును నిల్వ చేయాలని విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ఆటంకం కలగొద్దని ఆదేశించారు. వరదల నేపథ్యంలో నిధులను విడుదల చేయాలని ఆర్ధిక శాఖను సీఎం ఆదేశించారు. వరదల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జిల్లాల్లోనే వుండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కేసీఆర్ సూచించారు.