
రామగుండం-3 (ramagundam 3) బొగ్గు గని (singareni) పైకప్పు కూలి ఒక అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కేసీఆర్ ఘటనపై ఆరా తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను (singareni cmd sridhar) ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ సూచించారు. సహాయక చర్యలు చేపట్టామని, శిథిలాల నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు శ్రీధర్ సీఎంకు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని కేసీఆర్‌కు తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లా (peddapalli district) రామగుండం-3 పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో (adriyala longwall project) సోమవారం మధ్యాహ్నం సైడు పైకప్పు కూలడంతో ఒక అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం హుటాహుటిన సహాయక చర్చలు చేపట్టింది. దీనిలో భాగంగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా.. ఘటనాస్థలానికి కొద్ది దూరంలో పనిచేస్తున్న సపోర్టుమెన్ కార్మికుడు వీరయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటకు చేరుకున్నారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవీందర్, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్‌ల ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు.