కఠినంగానే ఉంటాం, ఆంక్షలు తప్పవు: ప్రజలు సహకరించాలన్న కేసీఆర్

By Siva KodatiFirst Published Mar 19, 2020, 7:58 PM IST
Highlights

కరీంనగర్‌లో కరోనా కలకలం నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 14 అన్నారు.

కరీంనగర్‌లో కరోనా కలకలం నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా తేలిన వారి సంఖ్య 14 అన్నారు. వేరే రాష్ట్రంల్లోని ఎయిర్‌పోర్టుల్లో దిగి తెలంగాణ వచ్చిన వారిని కనిపెట్టడం ఇబ్బందిగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

వియత్నాం చైనాకు దగ్గరే ఉందని, కానీ ఇప్పటి వరకు అక్కడ ఇబ్బందికర పరిస్ధితులు తలెత్తలేదని సీఎం చెప్పారు. ఏ దేశం అయితే ముందుగానే అప్రమత్తమైందో వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాలేదని కానీ చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు నిర్లక్ష్యం వహించడంతోనే ముప్పు ఎక్కువైందన్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్... వారిని సురక్షితంగా కాపాడండి: ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్

తొలి రోజు నుంచి కూడా తెలంగాణ కరోనా విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, రాష్ట్రంలో వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మార్చి 1 నుంచి విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వివరాలు ఇవ్వాలని కేసీఆర్ కోరారు.

విదేశాల నుంచి వచ్చిన వాళ్లను గుర్తించాలని కలెక్టర్లు, ఇతర అధికారులను ఆదేశించామన్నారు. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, పార్కులు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, థియేటర్లపై విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సీఎం తెలిపారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లోకి ప్రజల్ని అనుమతించవద్దని విజ్ఞప్తి చేసినట్లు కేసీఆర్ చెప్పారు.

25వ తేదీన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలను నిర్వహించేది లేదని, లైవ్ టెలికాస్ట్ ద్వారా ఉగాది ఉత్సవాలు తిలకించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్‌లో 1,160 మందిని క్వారంటైన్‌‌లో ఉంచామని.. విదేశాల నుంచి ఎవరొచ్చినా తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటామని.. బయటి దేశాల నుంచి వచ్చిన వారిలోనే వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Also Read:కరోనా కలకలం : కరీంనగర్ లో మరో వ్యక్తికి..హైదరాబాద్ కి తరలింపు...

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు యధాతథంగా కొనసాగుతాయని.. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షా కేంద్రాల్ని హై శానిటైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రతీరోజూ పదో తరగతి పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

కరోనాను అరికట్టే విషయంలో ఎంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని.. ఇదే సమయంలో సూపర్‌ మార్కెట్లు, మాల్స్ మూసే ప్రసక్తి లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా కల్యాణ మండపాలు, షాదీఖానాలు మూసివేస్తామని ముందే ముహూర్తాలు పెట్టుకున్న వివాహాలకు 200 మంది లోపే అతిథులు ఉండాలని సీఎం సూచించారు.

అలాగే సూపర్ మార్కెట్లలో రద్దీ తక్కువగా ఉండే చైసుకోవాలని, బ్లాక్ మార్కెట్ సృష్టించే వాళ్లపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమస్య తీవ్రతను బట్టి తదుపరి నిర్ణయాలు ప్రకటిస్తామని.. దయచేసి ప్రజలు ఎక్కువగా గుమికూడకపోవడమే మంచిదన్నారు.

అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దుచేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీసీఎంబీని వాడుకునే అవకాశం ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానిని కోరతామని సీఎం తెలిపారు. 

click me!