ఆర్టీసీ విలీనం లేదు.. 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతి: సీఎం కేసీఆర్

By sivanagaprasad Kodati  |  First Published Nov 2, 2019, 8:27 PM IST

కేబినెట్ సమావేశంలో మొత్తం 49 మంది అంశాలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 


కేబినెట్ సమావేశంలో మొత్తం 49 మంది అంశాలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందన్నారు. ఆర్టీసీ కార్మికులు బాధ్యతారహితంగా సమ్మె చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. వీలినం చేయకూడదని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని.. ఇది వ్యక్తి నిర్ణయం కాదని, కేబినెట్ నిర్ణయమని సీఎం తెలిపారు. సుధీర్ఘంగా చర్చించే విలీనం సరికాదని నిర్ణయం తీసుకున్నామన్నారు.

Latest Videos

undefined

ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ 10,400 బస్సులు నడుపుతోందని.. ఆర్టీసీ బస్సుల్లో 2,100 బస్సులు ప్రైవేట్ వ్యక్తులవేనని.. మరో 3 వేల బస్సులకు కాలం చెల్లిపోయిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Also Read:మిలియన్ మార్చ్ తరహాలో ఛలో ట్యాంక్ బండ్: ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమైనదని తేలిపోయిందని.. 49 వేలమంది కార్మికులు రోడ్డునపడే పరిస్ధితి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఇంకా ఆందోళన చేస్తామనడంలో అర్ధం లేదని.. ఎవరూ.. ఎవర్నీ బ్లాక్‌మెయిల్ చేసే పరిస్ధితి ఉండకూడదని కేసీఆర్ తెలిపారు.

పరీక్షలు, పండగల సమయంలో సమ్మె చేస్తామంటున్నారని.. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్ల మధ్య పోటీ ఉండాలని కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో మేము కఠినంగా వ్యవహరించలేదని.. 4 ఏళ్లకాలంలో 67 శాతం జీతాలు పెంచిన రికార్డు టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.

4 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశామని.. తాము ఎవరి పొట్టా కొట్టలేదని 23 రకాల ఉద్యోగులకు జీతాలు పెంచామని.. చేనేత కార్మికుల ఆత్మహత్యల్ని తగ్గించామని ఆర్టీసీ కార్మికుల్ని తమ బిడ్డలుగానే చూస్తున్నామని కేసీఆర్ తేల్చిచెప్పారు.

యూనియన్ల మాయలో పడి కుటుంబాల్ని చెడగొట్టుకోవద్దని నవంబర్ 5లోపు బేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని సీఎం తేల్చిచెప్పారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవేళ ఐదవ తేదీ అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5 వేల బస్సుల్ని కూడా ప్రైవేటుకిచ్చేస్తామని సీఎం హెచ్చరించారు. 

Also Read:RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో కర్ణాటక మోడల్?

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని... ఈ అశకాశం కూడా చేజార్చకుంటే ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్ తెలిపారు. మీ కుటుంబాలను రోడ్డున పడనివ్వొద్దని.. ఫైనల్ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. మూడు రోజుల్లోగా ఉద్యోగంలోకి చేరి భవిష్యత్‌ను కాపాడుకోవాలన్నారు. ఐదో తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే మీకు టైమ్ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలకు ప్రతిపక్షాలే బాధ్యత వహించాలన్నారు. లాభాలు వచ్చే రూట్లను ఆర్టీసీకే ఇస్తామని..నష్టాలు వస్తున్నాయని చెబుతున్న పల్లెవెలుగు రూట్లన్నీ ప్రైవేట్ వారికే ఇస్తామన్నారు.

కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిని ఎవరు ప్రశ్నించలేరని సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్వహణలో కఠిన నిర్ణయాలు తప్పవని.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ వెల్లడించారు. 

ఆర్టీసీని విలీనం చేస్తే ఇతర కార్పోరేషన్లు డిమాండ్ చేస్తాయన్నారు. కొత్త మోటార్ వెహికల్స్ చట్టంలో బీజేపీ ఎంపీలు భాగస్వామ్యులా కాదా అంటూ కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీవి శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలన్నారు.

కాంగ్రెస్ చరిత్రలో ఎక్కడైనా ఆర్టీసీని విలీనం చేశారా అని సీఎం ప్రశ్నించారు.  ఇప్పుడున్న ఆర్టీసీ టీఎస్ఆర్టీసీనే అని.. బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆర్టీసీ లేదని కానీ ఖచ్చితంగా ఆర్టీసీ మనుగడలో ఉండాలన్నారు. మొత్తంగా ప్రైవేట్‌కు ఇస్తే వాళ్లు కూడా బ్లాక్‌మెయిల్ చేయొచ్చన్నారు. 

click me!