గోదావరికి పెరిగిన వరద: సెక్రటేరియట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశం

By narsimha lodeFirst Published Sep 12, 2022, 9:59 AM IST
Highlights

గోదావరి పరివాహక ప్రాంతాలకు చెందిన జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సీఎస్ ను ఆదేశించారు కేసీఆర్.

హైదరాబాద్:ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.  మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

గోదావరి నదికి 9 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు దిగువకు వస్తుంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. గోదావరి పరివాహక  ప్రాంతాల జిల్లా అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కోరారు సీఎం కేసీఆర్. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని సీఎం సీఎస్ ను ఆదేశించారు.ఈ మేరకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని సీఎం కోరారు.

రెండు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు  కృష్ణా పరివాహక ప్రాంతంలోని జలాశయాలు కూడ నిండుకుండలా ఉన్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

అల్పపీడనం ప్రభావంతో మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. రికార్డు స్థాయిలో వరద వచ్చింది. భద్రాచలం వద్ద గోదావరి నది 70 అడుగులు దాటి ప్రవహించింది.  రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది 35 అడుగులకు చేరింది. గోదావరికి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువను కురుస్తున్న వర్షాలతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
 

click me!