కర్ణాటక, గుజరాత్ ఎన్నికల బరిలో కేసీఆర్ కొత్త పార్టీ!.. పక్కా ప్లాన్‌తో ముందుకు..?

Published : Sep 12, 2022, 09:39 AM IST
కర్ణాటక, గుజరాత్ ఎన్నికల బరిలో కేసీఆర్ కొత్త పార్టీ!.. పక్కా ప్లాన్‌తో ముందుకు..?

సారాంశం

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. దసరాలోపే ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీని స్థాపించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. దసరాలోపే ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్న కేసీఆర్.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ రాష్ట్రాల్లో సరైన అభ్యర్థులను గుర్తించి.. వారిని ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదా 2024 లోక్‌సభ ఎన్నికల బరిలో దించాలని కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలకు సూచించినట్టుగా సమాచారం. 

గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని తెలుగు ఓటర్లను క్యాష్ చేసుకోవాలని.. ఆ రాష్ట్రాల్లో తన కొత్త పార్టీని విస్తరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. 

జాతీయ పార్టీ హోదా పొందాలంటే నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం చెల్లుబాటు అయ్యే ఓట్లను పొందాల్సి ఉంటుంది. ఒక పార్టీ.. జాతీయ పార్టీ హోదాను పొందిన తర్వాత దాని సొంత చిహ్నం కలిగి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయించబడుతుంది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ పార్టీకి కారు గుర్తును కలిగి ఉంది. జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయననున్న కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి (BRS) పేరు వైపు మొగ్గు చూపుతున్నారని, అయితే గుర్తుగా మాత్రం కారును కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Also Read: దసరాలోపుగానే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్:తేల్చేసిన కుమారస్వామి

అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం 10 ఏళ్లకు ఒకసారి పార్టీల జాతీయ స్థితిని సమీక్షిస్తుంది. అందువల్ల జాతీయ పార్టీ ట్యాగ్‌ని పొందడానికి భారత రాష్ట్ర సమితి (ప్రచారంలో ఉన్న పేరు) 2026 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీల జాతీయ స్థితిపై చివరి సమీక్ష 2016లో జరిగింది. ఈ విషయంలో తదుపరి  సమీక్షకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది.

మరికొద్ది నెలల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. కేసీఆర్ మాత్రం గుజరాత్, కర్ణాటకలలో మాత్రమే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘గుజరాత్‌లోని సూరత్, ఇతర టెక్స్‌టైల్ హబ్‌ల వంటి ప్రాంతాల్లో వేలాది మంది తెలుగువారు (ముఖ్యంగా నేత కార్మికులు) స్థిరపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టనుంది. కర్ణాటకలో ప్రతిపాదిత బీఆర్‌ఎస్‌కు.. బెంగళూరుతో పాటు సరిహద్దు ప్రాంతాలైన రాయచూర్, కలబురగి, బీదర్‌లలో అభ్యర్థులు ఉంటారు. బెంగళూరులో వేలాది మంది తెలుగువారు స్థిరపడ్డారు. పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో కూడా తెలుగువారు చాలా మంది ఉన్నారు’’ అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. 

తెలంగాణలోని సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల.. మహారాష్ట్రతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్నాయి.‘‘నాందేడ్ జిల్లా నేతల నుంచి మా పార్టీ టిక్కెట్‌పై పోటీ చేయాలనే అభ్యర్థనలు వచ్చాయి’’ టీఆర్‌ఎస్‌ నేత ఒకరు తెలిపారు.

శరద్ యాదవ్ వంటి సీనియర్ జాతీయ నాయకులతో కూడా కేసీఆర్ తన పరిచయాలను పునరుద్ధరించుకుంటున్నారని భావిస్తున్నారు. యూపీ, ఢిల్లీలోని రైతు సంఘాల నేతలు, మేధావులు, మాజీ ప్రభుత్వోద్యోగులు, దళిత సంఘాల ప్రతినిధులకు కూడా టికెట్లు ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మాజీ సివిల్ సర్వెంట్లు, వివిధ రంగాలకు చెందిన నాయకులకు టిక్కెట్లు ఇచ్చిందని.. ఢిల్లీలో ఈ వ్యూహం ఫలించిందని పలువురు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?