రేపు ముంబైకి కేసీఆర్... ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్‌లతో జాతీయ రాజకీయాలపై చర్చ..!

Siva Kodati |  
Published : Feb 19, 2022, 10:04 PM IST
రేపు ముంబైకి కేసీఆర్... ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్‌లతో జాతీయ రాజకీయాలపై చర్చ..!

సారాంశం

టీఆర్ఎస్ (trs) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం, శివసేన (shivsena) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌‌తోనూ కేసీఆర్ భేటీకానున్నారు. 

టీఆర్ఎస్ (trs) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం, శివసేన (shivsena) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో (uddhav thackeray) ఆయన నివాసంలో భేటీకానున్నారు. సీఎం కేసీఆర్‌ను ఇటీవల ఉద్ధవ్‌ ఠాక్రే ముంబైకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు కేంద్రంలోని బీజేపీ (bjp) ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ బృందం థాక్రే అధికారిక నివాసం వర్షాలోనే భోజనాలు పూర్తి చేసుకొని.. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లనున్నారు. జాతీయ రాజ‌కీయ అంశాల‌పై పవార్‌తోనూ కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.

కాగా.. బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకం చేయడానికి తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని (mamata banerjee0 కలుస్తానని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. బిజెపికి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా వారిని కలుస్తానని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసి చర్చించినట్లు కూడా ఆయన తెలిపారు. తనను మమతా పశ్చిమ బెంగాల్ కు ఆహ్వానించారని, మమతా కూడా హైదరాబాద్ వస్తారని ఆయన అన్నారు. 

అటు మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ (hd devegowda) ..కేసీఆర్‌కు మద్ధతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సీఎం కేసీఆర్‌ను దేవేగౌడ‌ అభినందించారు.  మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని ఆయన చెప్పారు. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమంద‌రం మీకు అండగా వుంటాం… మీ యుద్దాన్ని కొనసాగించాలని కేసీఆర్‌కు దేవేగౌడ సూచించారు. దీనికి ముఖ్యమంత్రి బదులిస్తూ.. తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమ‌వుతాన‌ని చెప్పారు. 

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ బిజెపిపై స్వరం పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మరో 22 నెలల గడువు ఉంది. ఈ స్థితిలో అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకునేందుకు.. మోడీ గుజరాత్ మోడల్ ను కూడా కేసీఆర్ ప్రశ్నించారు. 2014 లోకసభ ఎన్నికలకు ముందు మోడీ గుజరాత్ మోడల్ తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే. మోడీ వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయాల్లో పెరగడానికి అది ప్రధానమైన కారణం. 

కేసీఆర్ మోడీని (narendra modi) వ్యక్తిగతంగా లక్షం చేసుకుని విమర్శిస్తూ వస్తున్నారు. ఊపర్ షెర్వానీ, అందర్ పరేషానీ అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ డ్రెస్ కోడ్ మీద వరుసగా వ్యాఖ్యలను సంధిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా కనిపించడానికి గడ్డం పెంచుకున్నారని ఆయన మోడీని విమర్శించారు. అరే బాప్ రే... తమిళనాడు వెళ్తే లుంగీ ధరించాల్సిందే, ఏమిటిది అని అన్నారు. ఈ విధమైన గిమ్మిక్కుల వల్ల దేశానికి ఒరిగేదేమిటని ఆయన ప్ఱశ్నించారు. 

మోడీది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్ ను ఆయన ఈ సందర్భంలో తెర మీదికి తెచ్చారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పడానికి ఆధారాలు కావాలని రాహుల్ గాంధీ అడిగితే తప్పేమిటని, ఎఐసిసి అధ్యక్షుడిగా ఆయన అడిగారని, ఇప్పుడు తాను అడుగుతున్నానని, ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు అదివారంనాడు మూడు గంటల పాటు కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన మీడియా సమావేశంలో ఆయన అనేక విషయాలను ముందుకు తెచ్చారు. బిజెపిని అధికారం నుంచి తరిమి కొడుతామని, ప్రజలు కోరితే జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ పెడుతానని ఆయన చెప్పారు. 

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే కేసీఆర్ ఉద్దేశం కొత్తదేమీ కాదు. 2018 నుంచి ఆయన అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగేలా చూసుకున్నారు. 2019 మార్చి -ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలను 2018 డిసెంబర్ లో జరిగేలా చూసుకున్నారు. అయితే, ఆ సమయంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెసుకు సవాళ్లు విసురుతూ వెళ్లారు. రాహుల్ గాంధీని అతి పెద్ద బఫూన్ గా అభివర్ణించారు. ప్రధాని మోడీకి దగ్గరవుతూ వచ్చారు. కేసీఆర్ కు బిజెపి బీ టీంగా పేరు వచ్చింది. బిజెపికి వ్యతిరేకంగా ఆయన ఒక రకంగా అకస్మాత్తుగా, తీవ్రంగా వైఖరిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu