
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (tamilisai soundararajan) మేడారం (medaram jatara) పర్యటనలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. గవర్నర్‌ను మంత్రులు రీసివ్ చేసుకోలేదు. గవర్నర్ వచ్చేసరికి అక్కడి నుంచి మంత్రులు వెళ్లిపోయారు. అయితే మంత్రులు లేకుండానే గిరిజనుల ఆరాధ్య దైవం .. సమ్మక్క- సారలమ్మలను (sammakka saralamma jatara) ఆమె దర్శించుకున్నారు.
కాగా.. తెలంగాణలో గత కొన్ని రోజులుగా రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో గులాబీ బాస్ వేస్తున్న అడుగులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. దీనికి స్పష్టమైన సమాధానం రాకపోయినా.. అవుననే రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత బలం చేకూరుస్తున్నాయి. గవర్నర్-ముఖ్యమంత్రికి దూరం పెరుగుతున్నదనే విషయాన్ని స్పష్టం చేసే విధంగా రిపబ్లిక్ డే లో ఏం జరిగిందనే దానితో పాటు అనేక అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
గత కొంత కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్, సీఎం కార్యాలయం మధ్య దూరం పెరుగుతున్నదని రాజకీయాల్లో చర్చ జరగడానికి రిపబ్లిక్ డే వేడుకలు కేంద్ర బిందువుగా మారాయి. రాజ్‌భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర మంత్రులు కూడా ఎవరూ హాజరు కాలేదు.
కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలతో, ఆ పార్టీ నియమించిన గవర్నర్‌తో దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి కారణం గవర్నర్ తమిళిసై ఇటీవల రాష్ట్ర ప్రగతిని కాకుండా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించడమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి తోడు ఇటీవల రాజ్‌భవన్‌లో రెండు ఫిర్యాదుల బాక్సులను కూడా తమిళి సై సౌందరరాజన్ ఏర్పాటు చేశారు. ఇది సీఎం కేసీఆర్ సర్కారుకు నచ్చలేదని రాజకీయాల్లోని ఓ వర్గం పేర్కొంటోంది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్ర కమలం నేతలు కేసీఆర్ సర్కారును టార్గెట్ చేయడంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే కావాలనే బీజేపీ నేతలతో పాటు, కేంద్రంలోని కమలం పార్టీ సర్కారు నియమించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు దూరం ఉంటున్నారని రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ప్రసంగం పైన కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజు నాడు గవర్నర్ చదివిన ప్రసంగం కాపీని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించలేదని, గవర్నరే స్వయంగా తయారు చేసుకుని చదివారని మాట్లాడుకుంటున్నారు.
మొత్తంగా బీజేపీతో పెరిగిన విభేధాల కారణంగా గవర్నర్ తో అంటిముట్టనంటూ సీఎం ఉంటున్నారని చర్చ నడుస్తోంది. తాజాగా మేడారంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదం మరోసారి ప్రగతి భవన్- రాజ్‌భవన్ మధ్య విభేదాలకు ఆజ్యం పోసేలా కనిపిస్తోంది.