
మేడారం (medaram jatara) సమ్మక్క-సారలమ్మ జాతరలో (sammakka saralamma jatara) చివరి ఘట్టం ముగిసింది. నాలుగు రోజులపాటు వైభవంగా సాగిన మేడారం జాతర ముగిసింది. గద్దెల వద్ద గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలు చేశారు. అనంతరం గద్దెల వద్ద నుంచి డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క తల్లి, కన్నెపల్లికి సారలమ్మ తల్లి, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు, ఏటూరు నాగారం కొండాయికి గోవిందరాజులు చేరుకోనున్నారు. వనదేవతల వనప్రవేశం వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. గురువారం సమ్మక్క తల్లి కొలువు దీరింది. దీంతో శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం మహాజాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్లను దర్శించుకొని బంగారం సమర్పించారు. ఇప్పటివరకు కోటి మందికిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (errabelli dayakar rao) తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించామన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర విజయవంతం చేసిన అధికారులను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆదేశాలతో మంత్రులు, ఉన్నతాధికారులు దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో వనదేవతల జాతర సజావుగా జరిగిందన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ మేడారం జాతరకు రూ.75 కోట్లు మంజూరు చేశారన్నారు. నాలుగు జాతరలకు కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 332.71 వెచ్చించిందని మంత్రులు తెలిపారు. ఈ నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని, మౌలిక వసతుల కొరత తీరిందన్నారు. సకాలంలో నిధులు విడుదల చేయడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారని మంత్రులు చెప్పారు.