కొండగట్టు ఆలయానికి ప్రత్యేక హెలికాప్టర్ లో తెలంగాణ సీఎం ఇవాళ బయలుదేరారు.
యాదాద్రి ఆలయం తరహలోనే కొండగట్టు ఆలయాన్ని పునర్నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన స్థపతి ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఆనంద్ స్థపతి ఇప్పటికే ఆలయాన్ని పరిశీలించారు.
దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్ రానున్నారు. 1998లో ఈ ఆలయానికి కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు రెండు గంటల పాటు కొండగట్టు క్షేత్రంలో సీఎం కేసీఆర్ గడుపుతారు.
అధికారులతో కలిసి ఆలయాన్ని పరిశీలించనున్నారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం తర్వాత ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. నిన్ననే కేసీఆర్ ఈ ఆలయానికి వెళ్లాల్సి ఉంది. అయితే నిన్న భక్తుల రద్దీ కారణంగా కేసీఆర్ తన పర్యటనను ఇవాళ్టికి వాయిదా వేసుకున్నారు.