
హైదరాబాద్:గాంధీ సిద్దాంతాలు నేటీ యువతకు ఆదర్శమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.
శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అహింసా పద్దతిలోనే స్వాతంత్ర్యం సాధించడం చాలా గొప్ప అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. .మార్టిన్ లూథర్ కింగ్ కు కూడా గాంధీనే ఆదర్శమని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ప్రపంచానికే పాఠం నేర్పింది మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన గుర్తు చేశారు.స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్ముడు నేతృత్వం వహించాక చాలా మార్పులు వచ్చాయన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా సాగిన పోరాటాలను ఈ తరం యువతకు తెలిపేందుకు వీలుగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా సీఎం చెప్పారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా సీఎం ప్రకటించారు.