
దేశం కోసం కొత్త పార్టీ పెట్టాలని అందరూ కోరుకుంటే తప్పకుండా పెడదామని కేసీఆర్ (kcr) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఫ్రంట్‌లు కాదు.. ప్రజలే ఫ్రంట్‌గా ఏర్పడాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్ధవ్ థాక్రేతో (uddhav thackeray) చర్చించేందుకు త్వరలోనే ముంబైకి వెళ్తానని కేసీఆర్ తెలిపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamta banerjee) ఫోన్ చేశారని.. త్వరలో కోల్‌కతాకు కూడా వెళ్తానని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో తప్పకుండా ప్రధాన పాత్ర నాదే వుంటుందని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా అన్ని పార్టీలు ఐక్యం కావాలని.. అందరం కలిసి బీజేపీని (bjp) ఇంటికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మాపై కూడా విచారణ జరగాలని.. అప్పుడే ఎవరేంటో తెలుస్తుందని, పవిత్రంగా ఎవరున్నారో తెలుస్తుందని సీఎం అన్నారు. మనకు పార్టీ పెట్టే దమ్ము లేదా అని కేసీఆర్ పిలుపునిచ్చారు. మోడీకి స్వాగతం పలికేందుకు తాను వెళ్లలేదని ఎవరెవరో ఏమేమో మాట్లాడారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరం కారణంగానే తాను మోడీకి స్వాగతం పలికేందుకు వెళ్లలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ గాంధీ (rahul gandhi) సాక్ష్యాలు అడగడంలో తప్పు లేదని.. తాను కూడా అడుగుతున్నానని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షనేతగా, ఎంపీగా అడిగే హక్కు రాహుల్ గాంధీకి వుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని సీఎం డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే పెట్రోల్ ధరలు పెరుగుతాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని.. దీనిని అరికట్టడానికి కొత్త రాజ్యాంగం రాయాలన్నారు. దేశమంతా దళితబంధు పెట్టాలని.. దీని కోసం రాజ్యాంగం రాయాలంటున్నానని, దళిత సంఘాలు వద్దంటాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా కన్నా గొప్ప ఆర్ధికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం , కొత్త స్పూర్తి రావాలన్నారు. తెలంగాణలాగా భారతదేశం కూడా మారడానికి కొత్త రాజ్యాంగం రావాలంటున్నానని సీఎం చెప్పారు.
77 శాతం దేశ సంపద 10 శాతం మంది దగ్గరే వుందని.. ధనికులు ఇంకా ధనికులవుతున్నారని, పేదలు మరింత పేదలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని.. వాట్సాప్ యూనివర్సిటీతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పేదలకు సబ్సిడీ ఎత్తేసి.. దొంగలకు సద్ది కట్టాలి, ఇది కేంద్రం తీరని సీఎం దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో 33 మంది బ్యాంకులను ముంచి పారిపోయారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
పార్లమెంట్‌లో ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ ప్రభుత్వమే చెప్పిందని సీఎం తెలిపారు. ఈడీ పెడతాం, సీబీఐ పెడతాం అని బెదిరిస్తున్నారని ... ఎన్నికల్లో గెలవకపోయినా పరిపాలన చేసే సిగ్గులేని పార్టీ బీజేపీ అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ పరువు పోలేదా అని ఆయన గుర్తుచేశారు. రాఫెల్‌పై రాహుల్ మాట్లాడితే ఆయనపై ఎదురుదాడి చేశారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధానికి క్షమాపణ చెప్పడం అలవాటేనని.. ప్రధాని అయితే గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయా అని అడిగితే, ముస్లింలకు మోడీ క్షమాపణ చెప్పారని సీఎం గుర్తుచేశారు.