మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. మహబూబాబాద్ లో పలు కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు.
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పార్టీ నూతన కార్యాలయాలను బీఆర్ఎస్ నిర్మించింది. కొత్త కలెక్టరేట్లతో పాటు పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా ఒకే రోజున ప్రారంభిస్తున్నారు కేసీఆర్., ఇవాళ పార్టీ కార్యాలయంతో పాటు కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో పాటు పాత జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు లేని చోట కార్యాలయాలను నిర్మిస్తున్నారు. పనులు పూర్తైన జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తున్నారు.
మహబూబాబాద్ లో సీఎం పర్యటనను పురస్కరించుకొని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ లు ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ టూర్ ను అడ్డుకోకుండా అరెస్ట్ లు నిర్వహించారు.