జీవో నెంబర్ 1పై సీపీఐ లంచ్ మోషన్ పిటిషన్: విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Jan 12, 2023, 12:32 PM IST

జీవో నెంబర్  1పై  సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకష్ణ  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు విచారణను ప్రారంభించింది. 


అమరావతి: జీవో నెంబర్  1పై  సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ  ఏపీ హైకోర్టులో  లంచ్ మోషన్  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై   గురువారం నాడు  ఏపీ  హైకోర్టు  విచారణ నిర్వహించింది. జీవో  నెంబర్  1 పై  రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు.  ఈ పిల్ పై  తమకు సమాచారం లేదన్నారు.  నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్ లో రావడానికి ఆస్కారం లేదన్నారు.  వెకేషన్ బెంచ్  విధాన పరమైన నిర్ణయాలకు  సంబంధించిన పిటిషన్లపై  విచారించవద్దని  అడ్వకేట్ జనరల్  శ్రీరామ్  వాదించారు.

రోడ్లపై  సభలు, ర్యాలీలు,  రోడ్ షోలు  నిర్వహించడాన్ని నిషేధిస్తూ  ఈ నెల  2వ తేదీన ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్  1ని విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 1 పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నాయి.  విపక్ష పార్టీలు సభలు , సమావేశాలు  నిర్వహించకుండా ఉండేందుకు గాను  రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను  తీసుకు వచ్చిందని  విపక్ష పార్టీలు  ఆరోపిస్తున్నాయి. 
ఈ జీవో ఆధారంగా  ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబును   పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తమ  పార్టీకి చెందిన ప్రచార రథాలు , ఇతర వాహనాలను  పోలీసులు సీజ్ చేయడాన్ని చంద్రబాబు  తప్పు బట్టారు. పోలీసుల తీరును  నిరసిస్తూ  చంద్రబాబునాయుడు ధర్నా కూడా నిర్వహించారు. 

Latest Videos

గత ఏడాది డిసెంబర్  28న ప్రకాశం జిల్లా కందుకూరులో టీడీపీ రోడ్ షో లో  జరిగిన  తొక్కిసలాట లో ఎనిమిది మంది మృతి చెందారు.  ఈ నెల  1న గుంటూరులో  చంద్రన్న సంక్రాంతి కిట్  పంపిణీ సమయంలో  తొక్కిసలాట జరిగింది.  ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ రెండు ఘటనలను పురస్కరించుకొని  రాష్ట్ర ప్రభుత్వం  జీవో నెంబర్  1న విడుదల చేసింది.  రోడ్ షో ల ద్వారా  అమాయక ప్రజలు చనిపోతున్నారని  రాష్ట్ర ప్రభుత్వం  చెబుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా  ఉండేందుకు గాను  జీవో నెంబర్ 1ని విడుదల చేసినట్టుగా   ప్రభుత్వం చెబుతుంది. ఈ జీవోను సమర్ధిస్తూ  వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు.  జీవో నెంబర్  1పై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా  మండిపడ్డారు.  

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల  8వ తేదీన  చంద్రబాబుతో భేటీ అయ్యారు.  కుప్పంలో  చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై  పవన్ కళ్యాణ్ చర్చించారు.  గత ఏడాది అక్టోబర్ మాసంలో పవన్ కళ్యాణ్ ను  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గత ఏడాది అక్టోబర్  19న పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పరామర్శించారు.

click me!