
తెలంగాణ ప్రజలకు వరదలపై (telangana floods) హెచ్చరికలు చేశారు సీఎం కేసీఆర్ (kcr) . మొన్నటి కంటే ఎక్కువ స్థాయిలో వరదలు వచ్చే ప్రమాదం వుందని కేసీఆర్ తెలిపారు. అధికార యంత్రాంగాన్ని హై అలర్ట్ చేసిన సీఎం.. నదులు, ఉప నదులు పొంగుతున్నాయన్నారు. వర్షాలు, వరదలపై శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు వున్నాయని అధికారులు , ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు కేసీఆర్. ప్రభుత్వ యంత్రాంగానికి ఇది పరీక్షా సమయమని.. పని ప్రదేశాలను వదిలి ఉద్యోగులు వెళ్లొద్దని సీఎం ఆదేశించారు.
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు , ప్రజా ప్రతినిధులను కేసీఆర్ ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాలు, జిల్లాల్లోనే వుండాలని సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముంపు ప్రాంతాల్లో పునరావాస పనులు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. అంతకుముందు నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గోదావరి ప్రవాహాన్ని, శ్రీరాంసాగర్ నుంచి కడెం వరకు వున్న పరిస్థితిలను కేసీఆర్‌కు వివరించారు. అటు భాగ్యనగరంలో వర్షాలు, వరదలు, నాళాల పరిస్ధితిపైనా సీఎం వివరాలు సేకరించారు.
ALso REad:Telangana Rains: భారీ వర్షాలు, వరదలు.. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్ సోమేశ్ కుమార్
ఇకపోతే... ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల 4 వారాల పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న మూడు రోజుల పాటు ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ములుగు, నల్గొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.