
ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తింపు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. రామప్పను వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో సభ్యత్వ దేశాలు, ఇందుకు సహకరించిన భారత ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే గుర్తింపు లభించేందుకు కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.
మరోవైపు రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన అందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read:రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం.. ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు
తెలంగాణలోని ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధాని చెప్పారు. అలాగే ఈ ఆలయాన్ని పర్యాటకులు సందర్శించాలని మోడీ విజ్ఞప్తి చేశారు.