
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌లో రాజకీయ వ్యుహాకర్త Prashant Kishorతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటి రోజే కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించే అవకాశం ఉంది.
ఈరోజు సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో (Arvind Kejrival) సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా మరికొందరు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే వారి అపాయింట్‌మెంట్స్ కొన్ని ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. ఇక, ఢిల్లీలో కొంతమది రిటైర్డ్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. వారిని హైదరాబాద్ జరపాలని చూస్తున్న సమావేశానికి ఆహ్వానించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులను కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు.
అంతేకాకుండా సీఎం కేసీఆర్ సాగు చట్టాల రద్దు కోసం పోరాటం చేసిన రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్‌తో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. వివాదస్పద సాగు చట్టాలకు వ్యతిరేక పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ మూడు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాకేష్ టికాయత్‌తో కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఇక, కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్లినవారిలో ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.
యూపీ ఎన్నికల్లో ప్రచారం..!
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాట్లో భాగంగా గత వారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో కేసీఆర్ ముంబై వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్వరలోనే హైదరాబాద్ లేదా మరోచోట బీజేపీయేతర సీఎంల సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగనున్నట్టుగా తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ ప్రధానంగా దీనిపై చర్చించే అవకాశం ఉంది.
ఇక, యూపీలో తుది విడుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీ తరఫున కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 3వ తేదీన వారణాసిలో(ప్రధాని మోదీ ఇక్కడి నుంచే లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు) సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది. ఇందులో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాట్లలో ఉన్న మమతా బెనర్జీ కూడా పాల్గొననున్నారు.
అయితే ఈ ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్, మమతా బెనర్జీతో పాటు కేసీఆర్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, కొంతకాలంగా కేసీఆర్ యూపీ ఎన్నికల ప్రచారంలో ఎస్పీ తరఫున ప్రచారం చేయనున్నారని టీఆర్‌ఎస్ వర్గాల నుంచి సంకేతాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.