
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వుండవని.. సరైన సమయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. ఈసారి టీఆర్ఎస్‌కు 95-105 స్థానాలు వస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఈసారి కూడా తమ దగ్గర బ్రహ్మాండమైన మంత్ర దండం వుందని.. 6 నెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో విప్లవం రావాల్సిన అవసరం వుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . దేశంలో గుణాత్మక మార్పు రావాలని.. ఇందుకోసం పౌరుడిగా తన బాధ్యత నిర్వర్తిస్తానని సీఎం స్పష్టం చేశారు. కొద్దిరోజుల్లోనే అన్ని వివరాలు ప్రకటిస్తానని కేసీఆర్ వెల్లడించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను (5 state elections)సెమీ ఫైనల్ అంటున్నారని.. యూపీలో ఎవరు గెలిచినా బీజేపీ (bjp) స్థానాలు తగ్గుతాయని సీఎం జోస్యం చెప్పారు. ఇది బీజేపీ పతనానికి నాంది అని.. అందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. రెండేళ్లలో దేశముఖ చిత్రాన్ని మార్చేస్తామని.. దేశం కోసం నడుం కడతానని ఆయన అన్నారు.
త్వరలో ముంబైకి:
ఇది ప్రధాన మంత్రి పదవికి పోటీకాదని .. దేశ ప్రజలను చైతన్యం చేయాలన్నదే తన ప్రయత్నమని సీఎం స్పష్టం చేశారు. నలుగురు నాయకులను కలవడం కాదని.. తెలంగాణ ఉద్యమంలో తాను నాయకుల వెంట పడలేదని కేసీఆర్ గుర్తుచేశారు. ఉద్యమం కోసం ప్రజలను చైతన్య పరిచానన్నారు. కొద్దిరోజుల్లో హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సమావేశం నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. ఏ రాష్ట్రంలో ఆ వేషం వేస్తే దేశం అభివృద్ధి చెందుతుందా.. బట్టలు మారిస్తే దేశం అభివృద్ధి జరుగుతుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. నిన్ననే ఉద్ధవ్ థాక్రేతో మాట్లాడానని.. రెండు మూడు రోజుల్లో ముంబై వెళ్తానని సీఎం స్పష్టం చేశారు.
అసదుద్దీన్ మా సోదరుడు:
దేశం కోసం ప్రాణమైనా అర్పిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. కుక్కలకు తాను భయపడనని.. యూపీలో (up polls) గెలిస్తే బీజేపీ అహంకారం మరింత పెరుగుతుందని సీఎం జోస్యం చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) మా సోదరుడని.. బీహార్‌లో ఐదు, మహారాష్ట్రలో రెండు సీట్లు గెలిచాడని.. తెలంగాణ బిడ్డ గెలిస్తే మంచిదే కదా అని కేసీఆర్ అన్నారు. నరేంద్ర మోడీకి చెప్పినా ఒకటే.. గోడకు చెప్పినా ఒకటేనని, దేశ ఆర్ధిక వృద్ధి పెంచే తెలివితేటలు కాంగ్రెస్, బీజేపీలకు లేవంటూ ఆయన దుయ్యబట్టారు. కొన్ని రోజుల్లోనే ఢిల్లీకి వెళ్తానని.. కలిసివచ్చే వారందరినీ కలుపుకుని పోతానని కేసీఆర్ తెలిపారు.
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి:
తన రాజకీయ లక్ష్యాల కోసం కాదు.. దేశం కోసం మాట్లాడుతున్నానని సీఎం అన్నారు. దేశంలో కొత్త రాజ్యాంగం రావాల్సిన అవసరం వుందని.. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చుకున్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా వుంటూనే దేశం కోసం పోరాడకూడదా అని సీఎం ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా వుంటూనే ప్రధాని కాలేదా అని ఆయన గుర్తుచేశారు. ఫ్రంట్‌లన్నీ దిక్కుమాలిన దందా అని.. దేశంలోని వివిధ రంగాల నిపుణులతో మాట్లాడానని కేసీఆర్ చెప్పారు. తన కర్తవ్యమేంటో నాకు బాగా తెలుసునని.. తెలంగాణలో నా కర్తవ్యాన్ని తాను నిర్వహించానని ఆయన తెలిపారు.
రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కొంటోంది:
దేశానికి కొత్త రాజ్యాంగం రావాలన్న దానిపై చర్చ జరగాలని.. కొత్త రాజ్యాంగం అవసరమని తాను ప్రతిపాదిస్తున్నానని సీఎం అన్నారు. దేశంలో చర్చ జరగనివ్వాలని.. బీజేపీ సీఎంలతో తానేందుకు మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో వున్న రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని సీఎం ఆరోపించారు. వన్ నేషన్- వన్ రిజిస్ట్రేషన్ (one nation one registration) షుగర్ కోటెడ్ టాబ్లెట్ అని ఆయన అభివర్ణించారు. ఇది రాష్ట్రాల అధికారాలను లాక్కునే ప్రయత్నమేనని కేసీఆర్ ఆరోపించారు. ఫెడరల్ వ్యవస్థను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం వ్యాఖ్యానించారు.