
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆయన మరణించిన ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును కేసీఆర్ ఆదేశించారు.
ALso Read: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో, లారీ ఢీ.. 5 గురు మృతి..
కాగా.. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలను పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలకు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద వివరాలను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణం స్పందించి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.