సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి తరలింపు !

By Mahesh RajamoniFirst Published Dec 11, 2023, 4:44 PM IST
Highlights

Telangana CM Camp Office: 33 ఎకరాల ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ ఇన్ స్టిట్యూట్ లో 150 మందికి పైగా స‌భ్యులు కూర్చునేందుకు వీలుగా నాలుగు వేర్వేరు కాన్ఫరెన్స్ హాళ్లు, బోర్డురూమ్, భారీ ఆడిటోరియం ఉన్నాయి. మంజీరా, కృష్ణా, గోదావరి, తుంగభద్ర అనే నాలుగు వేర్వేరు బ్లాకుల్లో అతిథులకు వసతి కల్పించవచ్చు. 
 

Telangana CM Anumula Revanth Reddy: తెలంగాణలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టి సారించింది. ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ స‌ర్కారు రాష్ట్రంలో దూకుడుగా అనేక పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ నుంచి ఎంసీఆర్ హెచ్ ఆర్ డీకి మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రజాభవన్ సీఎం క్యాంపు కార్యాలయంగా కొనసాగుతోంది. అయితే అక్కడ ప్రజాదర్బార్ జరుగుతుండటంతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని మరో చోటికి మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ఉన్న కార్యాల‌యం చూసే ప‌నిలో అధికారులు, సీఎం స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే, మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ)ని సీఎం క్యాంపు కార్యాల‌యంగా మార్చి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

Latest Videos

సోమవారం ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయం తరలింపుపై సీఎం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎంసీఆర్ హెచ్ ఆర్ డీని సందర్శించిన‌ట్టు స‌మాచారం. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం నివాసానికి సమీపంలో..

సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఎంసీఆర్ హెచ్ ఆర్ డీకి తరలిస్తే అది సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అతి సమీపంలోనే ఉంటుంది. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి ప్రాంతంలో సీఎం నివాసం ఉంది. ప్రస్తుతం ఆయన అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. క్యాంపు కార్యాలయాన్ని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి తరలిస్తే దూరం చాలా తగ్గుతుంది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి ఎక్కువ విస్తీర్ణం ఉండటంతో తగిన సౌకర్యాలు కూడా ఉన్నాయి. అక్కడ ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

click me!