
కేసీఆర్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భయం భయంగా బతకాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలోకి పోయిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా ఫెయిల్ అయిందని భట్టి ఎద్దేవా చేశారు. ధరణితో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని విక్రమార్క అన్నారు. 20 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ రియల్టర్ ఒక పక్కన... కట్టుకోవడానికి 20 గజాల స్థలం లేని వాళ్ళు ఒక పక్కన ఉన్నారని ఆయన దుయ్యబట్టారు.
ప్రజల సంపద ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని విక్రమార్క ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఫ్యూడల్స్ , దేశంలో కేపిటలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలే తమ అజెండా అని.. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని భట్టి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాన్ని తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. సంపద, వనరులు , స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయని భట్టి విక్రమార్క తెలిపారు. తాము ఏం చేశామో ప్రజలకు తెలుసునని.. తొమ్మిది ఏళ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ALso Read: ఉచిత కరెంటే కాదు, భూమి కూడా ఇచ్చాం : కేసీఆర్ సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం
తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దొచేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ధరణి అనేది మహమ్మారి లాగా అయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని ప్రజలు అడిగారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. చేనేత కార్మికులు జీఎస్టీ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారని ఆయన వెల్లడించారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్‌కి పట్టం కట్టాలని చూస్తున్నారని, సింగరేణిని బొంద పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని అనుకుంటున్నారని భట్టి విక్రమార్క చురకలంటించారు.