భావోద్వేగాల్ని రెచ్చగొట్టి.. డబ్బుతో, బీజేపీ గుజరాత్‌లో గెలిచిందిలా : భట్టి విక్రమార్క

By Siva KodatiFirst Published Dec 8, 2022, 3:45 PM IST
Highlights

అధికార దుర్వినియోగంతోనే బీజేపీ గుజరాత్‌లో గెలిచిందన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గుజరాత్‌లో బీజేపీని గెలిపించకపోతే దేశంలో తనను ఎవరూ గౌరవించరని మోడీ ప్రచారం చేశారని విక్రమార్క దుయ్యబట్టారు. 

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. డబ్బు, అధికార బలంతోనే గుజరాత్‌లో బీజేపీ విజయం సాధించిందన్నారు. దేశ వనరులన్నీ అక్కడికే తీసుకెళ్లారని.. ఎన్నికల పోరు బీజేపీకి, ఆప్‌కు మధ్యేనని ప్రచారం చేశారని భట్టి ఆరోపించారు. లౌకికవాద ఓట్లను చీల్చే క్రమంలో ఎంఐఎం, ఇతర పార్టీలను వాడుకున్నారని విక్రమార్క వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగంతోనే గుజరాత్‌లో బీజేపీ గెలిచిందన్నారు. ప్రధాని మోడీ గుజరాత్‌కు మాత్రమే ప్రతినిధిగా మాట్లాడారని.. ఆయన భావోద్వేగాల్ని రెచ్చగొట్టారని భట్టి ఆరోపించారు. గుజరాత్‌లో బీజేపీని గెలిపించకపోతే దేశంలో తనను ఎవరూ గౌరవించరని మోడీ ప్రచారం చేశారని విక్రమార్క దుయ్యబట్టారు. 

ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి వుండాలంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా భట్టి విక్రమార్క స్పందంచారు. రెండూ రాష్ట్రాలూ కలిసి వుండాలన్నది సజ్జల ఆలోచన అని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని బలంగా కోరుకున్నారని ఆయన గుర్తుచేశారు. రెండు రాష్ట్రాలు వుండాలని కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందని భట్టి అన్నారు. 

ALso Read:గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్.. ముహుర్తం ఖరారు.. హాజరుకానున్న మోదీ, షా..

ఇదిలావుండగా... గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. అక్కడ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ  స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు వివరాలు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు కూడా భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సీఆర్ పాటిల్ తెలిపారు. భూపేంద్ర పటేల్ ప్రమాణ  స్వీకార కార్యక్రమం డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని చెప్పారు. గుజరాత్ వ్యతిరేక శక్తులన్నింటినీ రాష్ట్ర ప్రజలు ఓడించారని కూడా కామెంట్ చేశారు. 1995 నుంచి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూ వస్తుంది. గత 27 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండగా..  ఇంత భారీ ఆధిక్యతతో ఆ పార్టీ ఎన్నడూ గెలవలేదు.


 

click me!