రేపు వరంగల్ లో జరిగే మోడీ టూర్ ను బహిష్కరిస్తున్నట్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో మోడీ టూర్ కు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.
హైదరాబాద్:రేపు వరంగల్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని మోడీ తెలంగాణకు వస్తున్నాడని ఆయన ప్రశ్నించారు. దీంతో రేపటి మోడీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ దూరం కానున్నారు.
శుక్రవారంనాడు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేపు వరంగల్ లో జరిగే ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నామన్నారు. ఈ పర్యటనకు తాము హాజరు కాబోమన్నారు.2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి మోడీ తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై మోడీకి ఎందుకంత విషాన్ని నింపుకున్నారో తెలియడం లేదన్నారు.
గుజరాత్ లో రూ. 20వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారన్నారు. కానీ రాష్ట్ర పునర విభజన హామీ అయినా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి కేంద్రం మొండి చేయి చూపిందని ఆయన ఆరోపించారు.కేవలం రూ. 520 కోట్లతో కోచ్ రిపేర్ ఫ్యాక్టరీ కాజీపేట లో పెట్టి గుజరాత్ కు కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయారన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారని కేటీఆర్ చెప్పారు. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చలేదన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామనే హమీ ఏమైందని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లపాటు కాలయాపన చేసి తెలంగాణకు రూ.520 కోట్లతో బిచ్చం వేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారన్న మోడీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.