
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంటోంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తో అఖిలపక్ష నాయకులు భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై మాత్రమే చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. ఇది సాధారణ సమావేశం మాత్రమేనని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను సంప్రదించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తారని గుర్తు చేశారు.
టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చినా ఎన్నికల కమిషన్ తరపున తాము సిద్దంగా ఉన్నామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. బ్యాలెట్ మిషన్లు, వివి పాట్ మిషన్లు నవంబరు కల్లా సిద్ధంగా ఉంటాయన్నారు. ఎన్నికలు ముందస్తుగా వచ్చినా 2018 జనవరి ఓటర్స్ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నామినేషన్లకు పది రోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు పొందొచ్చన్నారు. మరోవైపు సీఈఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని ఇప్పుడిప్పుడే ఇస్తున్నారని చెప్పారు.
టీఆర్‌ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.... కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని కాంగ్రెస్ సీనియర్‌నేత మర్రి శశిధర్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ ఓటర్లను తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా దంతాలపల్లిలో టీఆర్‌ఎస్ మద్దతుదారుల ఓట్లను ఉంచి మిగిలిన వారి ఓట్లు తొలగించారని శశిధర్ రెడ్డి ఆరోపించారు.
7 విలీన మండలాల్లోని ప్రజలు ఇంకా తెలంగాణ ఓటర్లుగానే ఉన్నారని గుర్తు చేశారు. ఇవన్నీ పక్కనపెట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తాము అనుకోవడం లేదని శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. అటు జూలై 28న ఇచ్చిన ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ‍్యంతరాలు వ్యక్తం చేశామని బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి తెలిపారు. ముందస్తు ఎన్నికలపై సీఈఓ తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారన్నారు. ఈ సమావేశానికి టీడీపీ తరపున రావుల చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గట్టు రామచందర్‌రావులు హాజరయ్యారు.