
Telangana: తెలంగాణ ప్రభుత్వం అడవులు సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అయితే, వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవుల్లో మంటలు చెలరేగడం సర్వసాధారణం. దీని కారణంగా అపారమైన నష్టం కలుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అడవుల్లో ముఖ్యంగా అమ్రబాద్ టైగర్ రిజర్వ్ (ATR) పరిధిలోని అటవీ ప్రాంతంలో మంటలను నిరోధించడానికి, నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా స్థానికంగా ఉంటున్న చెంచుల సేవలను ఉపయోగించుకోవాడానికి సిద్దమైంది. దీనిలో భాగంగా వారికి ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి అధికారులు రెడీ అవుతున్నారు.
రాష్ట్ర అడవులలో చెలరేగే మంటలు వాటిని నియంత్రించడం, నిర్వహణ సహా సంబంధిత పలు అంశాలపై స్థానిక చెంచులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే అడవుల్లో చెలరేగే మంటల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి అమ్రబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని పెంటాస్ (చెంచులు నివాసముంటే గ్రామాలు)లలో పనిచేయడానికి ఈ సీజన్‌కు సంబంధించి చెంచులను తాత్కాలికంగా నియమిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జనవరిలోనూ పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. విశేషమేమిటంటే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అమ్రబాద్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క అగ్నిప్రమాద సంఘటన కూడా చోటుచేసుకోలేదు. ఈ అటవీ ప్రాంతంలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా అమ్రబాద్ అటవీ రిజర్వులో దాదాపు 600 కి.మీ మేర ఫైర్ లైన్లు ఏర్పాటు చేశారు.
అమ్రబాద్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంత పరిధిలోని చోటుచేసుకునే అగ్నిప్రమాదాలు, నిర్వహణకు సంబంధించి అధికారులు మాట్లాడుతూ.. అడవిలో చెలరేగే మంటల నివారణ, నియంత్రణలో చెంచుల సంప్రదాయ పరిజ్ఞానాన్ని కూడా నేర్చుకుంటున్నారని అమ్రబాద్ టైగర్ రిజర్వుకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఒక్కో పెంటాలో (చెంచులు ఉండే గ్రామాలు) దాదాపు 45 నుంచి 50 మంది చెంచులను అగ్నిమాపక సిబ్బందిగా నియమించారు. వారు ఫైర్ లైన్లను పర్యవేక్షించడం, వాటిని నిర్వహించడం చేస్తారని అధికారులు తెలిపారు. వీరిలో పాటు బేస్ క్యాంపు అధికారులకు సైతం వీటిని పర్యవేక్షించనున్నారు. ఈ చర్య రెండు విధాలుగా పనిచేస్తోంది. స్థానిక చెంచులు సీజన్‌లో మంచి ఆదాయాన్ని పొందుతున్నందున, అటవీ శాఖ అగ్నిమాపక రేఖలను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి వీలవుతుంది. అలాగే, ఏదైనా సంఘటన జరిగితే తదనుగుణంగా చర్యలు తీసుకోవడానికి త్వరతగతిన స్పందనలకు వీలుంటుంది.
అమ్రబాద్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదల నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా అధికారులు ఏటీఆర్ ఫైర్ బ్లోయర్లను కొనుగోలు చేసి చెంచులకు అందజేస్తున్నారు. ఈ పరికరాలను ఆపరేట్ చేయడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి వారికి శిక్షణ ఇస్తున్నారు. సకాలంలో జోక్యం చేసుకోవడం, మంటలను నియంత్రించడంలో సమర్థవంతమైన మార్గాన్ని నిర్ధారించడం లక్ష్యంగా అధికార యంత్రాంగం ఈ చర్యలు తీసుకుంటున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగితే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు రెండు, మూడు గంటల సమయం పడుతుందని తెలిపారు. అయితే, ప్రతి పెంటాలోని ముఖ్యమైన ప్రాంతాన్ని చెంచులు పర్యవేక్షిస్తారు కాబట్టి, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి వీలవుతుందని, సమయం కూడా చాలా వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.