రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. కరోనా నియత్రణకు కఠిన ఆంక్షలు..?

By Sumanth KanukulaFirst Published Jan 16, 2022, 10:47 AM IST
Highlights

తెలంగాణ కేబినెట్ (telangana cabinet) భేటీ సోమవారం(జనవరి 17) జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) నేతృత్వంలో మంత్రివర్గం రేపు మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కరోనాతో పాటు తదితర విషయాల మీద కేబినెట్ లో చర్చించనున్నారు.

తెలంగాణ కేబినెట్ (telangana cabinet) భేటీ సోమవారం(జనవరి 17) జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) నేతృత్వంలో మంత్రివర్గం రేపు మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరోనాతో పాటు మరికొన్ని ఆంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ఇప్పటికే కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఈ ఆంక్షల ప్రకారం.. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పని సరి మాస్కు ధరించాలి. మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలపై నిషేధం విధించింది. అయితే ఈ ఆంక్షల గడువు.. 20వ తేదీతో ముగియనుంది. తెలంగాణలో రోజువారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో రెండు వారాల పాటు కరోనా ఉధృతి కొనసాగుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే రేపటి కేబినెట్ భేటీలో కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానంగా చర్చించడంతో పాటు.. మరిన్ని ఆంక్షలు విధించడంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కోవిడ్ కట్టడిలో భాగంగా రాష్ట్రంలో మళ్లీ నైట్‌ కర్ఫ్యూ విధిస్తారా? లేదా.. మరో విధంగా ఆంక్షలు పెడతారా? అనేది తెలియాల్సి ఉంది. అలాగే సినిమా థియేటర్లు, పబ్‌లు నిర్వహణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..?, పబ్లిక్‌ ప్లేస్‌లలో ఎలాంటి ఆంక్షలు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కరోనా కట్టడికి ఏపీతో సహా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 

click me!