ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి నిర్ణయం, వరద సహాయం కింద రూ. 500 కోట్లు: కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేటీఆర్

By narsimha lode  |  First Published Jul 31, 2023, 8:24 PM IST

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు  కమిటీని ఏర్పాటు చేయాలని  కేబినెట్  నిర్ణయం తీసుకుంది.  ఇవాళ  ఐదు గంటల పాటు నిర్వహించిన  కేబినెట్ సమావేశ వివరాలను  మంత్రి కేటీఆర్ మీడియాకు వివరించారు.


హైదరాబాద్:తెలంగాణ ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయాలని  నిర్ణయం తీసుకుందని  మంత్రి కేటీఆర్  చెప్పారు.టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను  ప్రభుత్వ ఉద్యోగులుగా  గుర్తించేందుకుగాను   అధికారులతో కూడిన సబ్ కమిటీని  ఏర్పాటు చేసిందని  మంత్రి చెప్పారు. తెలంగాణ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను  మంత్రి కేటీఆర్  సోమవారంనాడు రాత్రి  మీడియాకు వివరించారు.  రాష్ట్రంలోని పది జిల్లాల్లో భారీ వర్షాలతో రైతులు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని  మంత్రి కేటీఆర్ చెప్పారు. పంటలు, రోడ్లు, తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సహాయం కోసం  రూ. 500 కోట్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని  మంత్రి కేటీఆర్ చెప్పారు.

.టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు  చేశారు.ఈ విషయమై ఇవాళ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు.43, 373  మంది ఆర్టీసీ ఉద్యోగులను  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టుగా  చెప్పారు.

Latest Videos

సబ్ కమిటీ అధ్యక్షుడిగా   ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నియమించారు.టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా  గుర్తించేందుకు వీలుగా ఆగస్టు  3వ తేదీ నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులను  ప్రవేశ పెట్టాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు.  


వరద నష్టంపై క్యాబినెట్ లో చర్చించినట్టుగా మంత్రి చెప్పారు. వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తక్షణం మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  మరో వైపు  విద్యుత్ సంస్థ ఉద్యోగులను సన్మానించాలని  కేబినెట్ నిర్ణయం తీసుకుందని  కేటీఆర్ చెప్పారు. వరదల సమయంలో  అద్భుతంగా పనిచేసిన విద్యుత్ సంస్థ ఉద్యోగులను సన్మానిస్తామన్నారు. 

హైదరాబాద్ నగరంలో కీలక రూట్లలో మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు.  మూడు నాలుగేళ్లలో మెట్రో విస్తరణను  పూర్తిచేయాలని కేబినెట్ లో  నిర్ణయం తీసుకున్నట్టుగా  మంత్రి తెలిపారు. 

వరంగల్ పట్టణంలో ఎయిర్ పోర్టు కు 253 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కు పంపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  కేటీఆర్ చెప్పారు.  హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్టు అవసరం ఉందన్నారు.  హాకింపేట ఎయిర్ పోర్ట్ ను గోవా తరహాలో పౌర విమానయాన సేవలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని  మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని  కేటీఆర్ వివరించారు. వర్షాలు, వరదలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన  ప్రజలను కోరారు.పంట నష్టం పై పూర్తి నివేదిక అందాక నిర్ణయం తీసుకోనున్నట్టుగా కేటీఆర్ చెప్పారు. కేంద్రం కూడా రాజకీయాలు మాని రాష్ట్రానికి సహాయం చేయాలని ఆయన కోరారు. 
 

click me!