తీన్మార్ మల్లన్నకు బిజెపి మద్దతు... ఇప్పటికే యువమోర్చా రంగంలోకి: బండి సంజయ్ (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 4, 2021, 1:23 PM IST
Highlights

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న సారధ్యంలోని క్యూ న్యూస్ ఆఫీస్ పై మంగళవారం పోలీసులు దాడి చేయడాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించేవారిపై ఇలా దాడులకు పాల్పడటం మంచిపద్దతి కాదన్నారు. 

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులే టార్గెట్ గా వార్తలను ప్రసారం చేసే క్యూ న్యూస్ ఆఫీస్ పై మంగళవారం రాత్రి పోలీసులు దాడి చేసిన విషయం తెలిసింది. జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న సారథ్యంలో నడిచే ఈ ఆఫీస్ పై పోలీసులు దాడి చేయడాన్ని తెలంగాణ బిజెపి అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ఖండించారు. పోలీసుల తీరు అత్యంత దుర్మార్గమని అన్నారు. 

''ప్రశ్నించే గొంతులని అణచివేయడానికి పథకం‌ ప్రకారమే దాడి జరిగినది. అనేక మంది ప్రజాప్రతినిధులు అక్రమాలకు సంబంధించిన ఆధారాలే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆయన తనయుడికి సంబంధించిన అనేక ఆధారాలు క్యూ న్యూస్ అఫీసులో ఉన్నాయి. అందువల్లే పథకం ప్రకారమే దాడి చేసి ఆధారాలన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు వస్తే నోటిసు ఇచ్చి చట్టాలకి అనుకూలంగా వ్యవహరించాల్సిన పోలీసులు ముఖ్యమంత్రి డైరెక్షన్ లో బరి తెగించి దాడులు చేయడం దుర్మార్గం'' అని బండి సంజయ్ మండిపడ్డారు. 

వీడియో

''వందలమంది పోలీసులు క్యూ న్యూస్ ఆఫీస్ లోకి చొరబడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రశ్నిస్తే ఇలాగే దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తామని అన్నట్లుగా వుంది.  భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలిచి నిన్న రాత్రే ఘటనా స్థలానికి చేరుకుంది. ముఖ్యమంత్రి స్పందించి ఇలాంటి దాడులు ఇకపై జరక్కుండా చూడాలి'' అని బండి సంజయ్ సూచించారు. 

click me!