దసరా సెలవులు 22 రోజులా...కేసీఆర్‌పై లక్ష్మణ్ ఫైర్

By Siva KodatiFirst Published Oct 13, 2019, 5:32 PM IST
Highlights

ఎవరైనా దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రైవేట్ బస్సులను, డ్రైవర్లను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు

కేసీఆర్ పోలీస్ బలగాల ద్వారా సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.

నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన .. బస్‌భవన్ వద్ద తాము శాంతియుతంగా జరిపిన నిరసనను పోలీసులు అడ్డుకోవటం సరికాదన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి కార్మిక, ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలను సృష్టించారని.. నేడు కేసీఆర్ సైతం అదే పద్ధతిని ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు.

టీఎన్జీవో నేతలను ఇంటికి పిలిచి వారితో ముఖ్యమంత్రి చర్చలు జరిపారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. 50 వేల కుటుంబాలకు సెప్టెంబర్ నెల జీతం ఇవ్వకుండా దసరా పండుగను జరుపుకోకుండా చేశారని.. కానీ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మాత్రం ఆగలేదని లక్ష్మణ్ విమర్శించారు.

కిరణ్‌కుమార్ రెడ్డి సైతం కేసీఆర్‌లా వ్యవహరించలేదన్నారు. కార్మికుల సమ్మెకు మద్ధతు తెలిపేందుకు ఉద్యోగ, కార్మిక, ఉద్యోగ సంఘాలు రెడీ అవుతున్న సమయంలో కావాలని ఉద్యోగ సంఘాలను ఇంటికి పిలిచారని లక్ష్మన్ ఆరోపించారు.

నాడు కిరణ్‌కుమార్ రెడ్డి మొండిపట్టుదల కారణంగా ఎంతోమంది తెలంగాణ బిడ్డలు చనిపోయారని.. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయాల వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

సమ్మెను గుర్తించేది లేదని, చర్చలు జరిపేది లేదని.. బస్సులు ఆపితే కేసులు పెడతామంటూ కే.చంద్రశేఖర్ రావు వార్నింగులు ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆందోళన చేస్తున్న మహిళా కండక్టర్ల చీరలను పోలీసులు లాగడమేనా ఆత్మగౌరవం అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.

కమీషన్లతో పాటు ఆర్టీసీని అనుచరులకు అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని ఆయన విమర్శించారు. ఆరేళ్లలో ఒక్క డ్రైవర్, కండక్టర్, మెకానిక్ పోస్ట్ సైతం కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేయలేదని లక్ష్మణ్ దుయ్యబట్టారు.

ఏడు వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారని.. ఈ పోస్టుల భర్తీపై కేసీఆర్ చర్య తీసుకోలేదని, చివరికి ఆర్టీసీ కార్మికుల పీఎఫ్‌ నిధులను సైతం వాడుకున్నారని ఆయన మరోపించారు.

ఎవరైనా దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రైవేట్ బస్సులను, డ్రైవర్లను పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వోద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులను సచివాలయానికి రాకుండా ఆంక్షలు విధించడంతో పాటు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. 

click me!