ఆ లేఖ ఎక్కడిదో తెలుసుకోవడం బ్రహ్మవిద్యేమీ కాదు: బండి సంజయ్

By Siva KodatiFirst Published Nov 21, 2020, 3:05 PM IST
Highlights

కేసీఆర్ నిజమైన హిందువు కాబట్టే భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రావాల్సిందిగా సవాల్ విసిరానని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

కేసీఆర్ నిజమైన హిందువు కాబట్టే భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రావాల్సిందిగా సవాల్ విసిరానని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వందల ఎకరాలు వున్న మంత్రి తనకు నీతులు చెబుతున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు.

ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు గానీ.. తర్వాత అధికారం మాదేనని ఆయన జోస్యం చెప్పారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని.. అధికారంలో వున్నవారు అరెస్ట్ చేయలేరా అని సంజయ్ నిలదీశారు.

ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో, ఎవరు తప్పు చేశారో అందరికీ తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. వరద సాయంపై ఈసీకి తాను లేక రాయలేదని... తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సంజయ్ అన్నారు.

టీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని.. మజ్లిస్ ఎట్లా చెబితే, కేసీఆర్ అలా అడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో 40 వేలకు పైగా రోహింగ్యాలు వున్నారని వాళ్లని ఇక్కడ నుంచి పారద్రోలుదామా లేదా అన్న దానిపై టీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వాలని బండి సంజయ్ నిలదీశారు.

రోహింగ్యాలను ఓటర్ లిస్ట్‌లోకి చేర్చించి ఎంఐఎం పార్టీనే అని.. వాళ్లు టీఆర్ఎస్, ఎంఐఎంకు మాత్రమే ఓట్లు వేస్తారని ఆరోపించారు. నేను వాస్తవాలు చెప్పినా టీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని, వాళ్లు ఏం చేయాలో అది చేస్తారని సంజయ్ స్పష్టం చేశారు.

ఉగ్రవాద సంస్థలతో సంబంధం వున్న వ్యక్తులతో సానుకూలంగా వ్యవహరిస్తూ, వాళ్ల ఓట్ల కోసం కక్కుర్తిపడి వాటి ద్వారానే జీహెచ్ఎంసీని కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు సెక్యులర్ వాదులు, దేశభక్తులా అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

వ్యతిరేకించిన తాము మాత్రం రెచ్చగొట్టేవాళ్లమా అని నిలదీశారు. ఛాయ్‌వాలా దేశానికి ప్రధాన మంత్రిగా వున్నారన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయనపైనే ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీని కంట్రోల్ చేయగల శక్తి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎంలకు లేదని.. అది కేవలం ప్రజల చేతుల్లో మాత్రమే వుందని సంజయ్ స్పష్టం చేశారు. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికే ప్రజలు తమను ఆదరిస్తున్నారని చెప్పారు.

రెచ్చగొట్టే ఆలోచన తమకు లేదన్నారు. హైదరాబాద్‌లో ఎంతమంది బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు వున్నారు.. వీరిలో ఎంతమందికి మీరు ఓటు హక్కు కల్పించారని ఆయన ప్రశ్నించారు.

బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాల్లో వున్న హిందువుల రక్షణ కోసం తీసుకొచ్చిన సీఏఏను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని.. ఇదే సమయంలో హైదరాబాద్‌లో వున్న విదేశీయుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

వరద సాయంపై ఎలాంటి లేఖ అందలేదని స్వయంగా ఎస్ఈసీనే చెప్పారని.. ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది..? అనేది తేల్చడం బ్రహ్మవిద్యేమీ కాదన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ, వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఏ పార్టీ చేయదని సంజయ్ చెప్పారు. 

click me!