వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కమలం నేతలు దృష్టి సారించారు. జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ నేతలు ఇవాళ సమావేశమయ్యారు.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ నేతలు మంగళవారంనాడు ఆ పార్టీ అగ్రనేతలతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పార్టీ నాయకత్వం దిశానిర్ధేశం చేయనుంది. తెలంగాణకు చెందిన పార్టీ కోర్ కమిటీ నేతలకు పిలుపు రావడంతో తెలంగాణ నేతలు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. నిన్న రాత్రే బీజేపీ నేతలు న్యూఢిల్లీకి చేరారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్ కూడ హజరయ్యారు.
బీజేపీ తెలంగాణకు చెందిన కోర్ కమిటీ సభ్యులను ఢిల్లీకి రావాలని పార్టీ అగ్రనాయకత్వం నిన్న సమాచారం పంపింది.ఈ సమాచారం అందిన వెంటనే పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ విషయమై బీజేపీ నాయకత్వం ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రలజ మధ్యే ఉండేలా పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆందోళనలు, పాదయాత్రల వంటి కార్యక్రమాలను పార్టీ నాయకత్వం రూపొందిస్తుంది.
దక్షిణాదిలో కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించి పనిచేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కమలనాథులు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే కార్యక్రంపై పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది.
also read:టీ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు.. రేపు అమిత్ షాతో కీలక భేటీ..
తెలంగాణలో బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పలితాలను కూడా ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తుకున్నారు. బీజేపీ ప్రచారంతో రాజకీయంగా తాము నష్టపోతున్నామని కాంగ్రెస్ భావిస్తుంది. హత్ సే హత్ జోడో పేరుతో కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు నిర్వహించనున్నారు.ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ఆ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా పాదయాత్రలు నిర్వహించనున్నారు.