బీజేపీలో మూడు ముక్కలాట? నేనే సీఎం క్యాండిడేట్ అంటూ ఈటల, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం!

By Mahesh K  |  First Published Jul 13, 2023, 2:44 PM IST

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈటల, బండి సంజయ్ వర్గాల మధ్య వైరం సమసిపోతుందని, అంతా ఏకతాటి మీదికి వస్తారని అనుకున్నారు. కానీ, కిషన్ వర్గం ఒకటి కొత్తగా తయారై.. పార్టీలో మూడు వర్గాలు ఏర్పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 


హైదరాబాద్: ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా బీజేపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో, కనీసం గట్టి పోటీని ఇవ్వగలిగే స్థానంలో ఉన్నామా? అనే చర్చను కాకుండా.. తామే ముఖ్యమంత్రి అభ్యర్థులం అని తెలంగాణ బీజేపీలోని ముగ్గురు కీలక నేతలు చర్చించుకున్నట్టు తెలిసింది. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటల వర్గం అంటూ విడిపోయిన తర్వాత అందరినీ ఏక తాటి మీదికి తీసుకురావడానికి ఆ పార్టీ అధిష్టానం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. అయినా, ఆ పార్టీల వర్గ విభేదాలు చల్లారడం లేదని తాజాగా కొన్ని వర్గాలు చెబుతున్న సమాచారం.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలపడగా.. బీజేపీ మాత్రం దారుణంగా పతనమైంది. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీకి గట్టి పోటీనిచ్చే స్థానంలోనైనా బీజేపీ లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్‌ను సమీకరించి బలంగా ప్రజల్లో పార్టీని నిర్మించే పనిలో పడాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితత్వంతో అడుగులు వేస్తూ నెంబర్ 2లోనైనా కొనసాగాలి. 

Latest Videos

Also Read: Telangana: పెళ్లి వేడుకలో తల్వార్లు, తుపాకులతో డ్యాన్స్.. నవవరుడు సహా ఇతరులు అరెస్ట్

ఈ కర్తవ్యం ప్రధానంగా ఉండాలి. కానీ, దీని గురించి పట్టించుకోకుండా ముగ్గురు కీలకమైన నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు తామే ముఖ్యమంత్రి అభ్యర్థులం అవుతానే చర్చకు తెరతీసినట్టు తెలిసింది. ఇంతకు ముందు రెండు వర్గాలుగా ఉన్న పార్టీ.. ఇప్పుడు మూడు వర్గాలుగా చీలిపోయిందనే మాటలు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో సాధించే ఎమ్మెల్యే సీట్లను పక్కనపెట్టి సీఎం సీటు గురించి ఈ నేతలు తమ సన్నిహిత నేతలతో మాట్లాడుతున్నారనే వార్తలు పార్టీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. తనకు అధినాయకత్వం అండ ఉన్నదని కిషన్ రెడ్డి.. ఎన్నికల నిర్వహణ తన చేతిలో ఉన్నదని ఈటల, పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చింది తానేనని బండి సంజయ్ తన అనుచరుల వద్ద మాట్లాడుతున్నట్టు సమాచారం. పార్టీలో నాయకత్వ స్థాయిలో ఉన్న నేతల మధ్య దూరం పెరుగుతుండటంతో క్యాడర్‌లో డైలమా మొదలైంది.

click me!